షాక్ : కలెక్టర్ ఇంటికి కరెంట్ కట్

  • Published By: nagamani ,Published On : September 19, 2020 / 03:58 PM IST
షాక్ : కలెక్టర్ ఇంటికి కరెంట్ కట్

కరెంట్ బిల్లు కట్టలేదని ఏకంగా కలెక్టర్ ఇంటికి కనెక్షన్ కట్ చేశారు అధికారులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న ఆ జిల్లా కలెక్టర్‌‌తో పాటు ఇతర ఉన్నతాధికారుల ఇళ్లకు ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.


2016లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న కలెక్టర్లకు ఉన్నతాధికారుల నివాసాలకు భవనాలు లేవు. దీంతో జిల్లా కేంద్రంలోని ఎంసీసీ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే అధికారుల కోసం నిర్మించిన ఇళ్ళలో కొన్ని ఖాళీ ఉండడంతో వాటిలో జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్..అడిషనల్ కలెక్టర్ నివాసం.. డీసీపీ నివాసాల కోసం కేటాయించారు. అప్పటినుంచి వారు అందులోనే ఉంటున్నారు.


అయితే ఎంసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం గత రెండు సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీకి సంబంధించిన విద్యుత్ బకాయిలు చెల్లించడంలేదు. దీంతో రూ.11 కోట్ల మేర విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. ట్రాన్స్‌కో అధికారులు పలుమార్లు ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటీసులు పంపినప్పటికీ ఫలితం లేదు. వారి నుంచి ఎటువంటి స్పందన లేదు.


ఈ క్రమంలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారుల ఇళ్లకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కానీ.. సాయంత్రానికి ఉన్నతాధికారుల ఇళ్లకు వేరే లైన్ ద్వారా సరఫరాను పునరుద్ధరించారు.