Rythu Bandhu : 15న ఖాతాల్లోకి డబ్బులు.. 61.55లక్షల మందికి రైతుబంధు

వ్యవసాయం కోసం రైతులకు ఆర్థికసాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు. రైతు బంధు సాయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Rythu Bandhu : 15న ఖాతాల్లోకి డబ్బులు.. 61.55లక్షల మందికి రైతుబంధు

Telangana Rythu Bandhu

Rythu Bandhu : వ్యవసాయం కోసం రైతులకు ఆర్థికసాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు. రైతు బంధు సాయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ 15వ తేదీ నుంచి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. రైతుబంధు పథకానికి కొత్తగా అర్హులైన రైతుల సంఖ్య 2.22 లక్షలున్నట్లు తేలింది. వీరంతా రెవెన్యూ రికార్డుల్లో భూమి ఖాతాల ప్రకారం పార్ట్‌ బీ నుంచి పార్ట్‌ ఏ విభాగంలోకి మారిన వారని రెవెన్యూశాఖ తెలిపింది. గత యాసంగిలో 59.33 లక్షల మందికి ఈ పథకం సొమ్ము అందింది. కొత్తగా 2.22 లక్షల మందిని చేరుస్తున్నందున మొత్తం ఈ సీజన్‌లో సొమ్ము అందుకునే వారి సంఖ్య 61.55 లక్షలుంటుందని ప్రాథమిక అంచనా.

ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులను జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో నిలిచిందన్నారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో అభివృద్ధి కోసం అధికంగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

మహానగరాలను తలదన్నేలా కొన్నేళ్లలో గ్రామాలు మారనున్నాయని చెప్పారు. నిధుల కేటాయింపుతోనే అభివృద్ధి జరగదని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. గతంలో ధాన్యం పండించే రాష్ట్రాల్లో పంజాబ్‌ ముందు వరుసలో ఉండేదని, నేడు తెలంగాణ ఏడాదికి 3 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పండిస్తుందని తెలిపారు. ఈ ఏడాది రైతుల అవసరాలకు మించి ఎరువులు నిల్వ ఉన్నాయని మంత్రి చెప్పారు.