Vaccination: సూపర్ స్ప్రెడర్స్ ఎవరు? తెలంగాణలో ముందుగా వ్యాక్సిన్ వారికే!

Vaccination: సూపర్ స్ప్రెడర్స్ ఎవరు? తెలంగాణలో ముందుగా వ్యాక్సిన్ వారికే!

Vaccination

Super spreaders vaccination కరోనా కట్టడే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో లాక్‌డౌన్ సత్ఫలితాలిస్తోంది. 18గంటల పాటు ఆంక్షలు అమల్లో ఉంటుండటంతో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరో పదిహేను రోజుల్లో కరోనా సెకండ్ వేవ్‌ను పూర్తిగా కంట్రోల్ చేసే దిశగా అడుగులు వేస్తూ.. ప్లానింగ్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దానికి తగ్గట్లుగానే చర్యలు తీసుకుంటోంది.

లాక్‌డౌన్‌తో ఫలితాలు కనిపిస్తుండటంతో.. ఇప్పుడు వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిల్వలు రాకపోవడం.. ఫస్ట్ డోస్ వేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. 10 రోజుల పాటు వ్యాక్సినేషన్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభుత్వం.. మళ్లీ టీకా పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే వ్యాక్సిన్ సరఫరా కోసం గ్లోబల్ టెండర్లకు వెళ్లిన ప్రభుత్వం… వ్యాక్సినేషన్‌పై మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. పని ప్రదేశాల్లో 18 ఏళ్లు దాటిన వారికి టీకా వేయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో మే 28వ తేదీ తర్వాత సూపర్ స్ప్రెడర్స్‌కి టీకా వేసేందుకు ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది.

ప్రభుత్వ కేంద్రాల్లో రెండో డోస్ వారికి కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ ప్రారంభించింది. వాక్సినేషన్ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 28 నుంచి సూప‌ర్ స్ప్రెడ‌ర్స్‌కు కొవిడ్ టీకా ఇవ్వాల‌ని నిర్ణయించింది. సూపర్ స్ప్రెడర్స్ ఎవరని విషయాన్ని నిర్ధారించడం, వారికి ఎలా వ్యాక్సిన్ వేయాలనే విషయాలపై విధివిధానాలు నిర్ణయించాలని సీఎం కేసీఆర్ ఇటీవలే ఆదేశించారు. బాధ్యతలను మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. దీంతో.. సీఎస్, ఉన్నతాధికారుల‌తో స‌మావేశం అయిన హ‌రీష్ రావు సూప‌ర్ స్ప్రెడ‌ర్స్ ఎవ‌రో లెక్కలు తేల్చారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 30 లక్షల వరకు సూపర్ స్పైడర్స్ ఉంటారని అంచనా వేశారు.

ముందుగా జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఆటో డ్రైవ‌ర్లు, బ‌స్సు డ్రైవ‌ర్లు, హోట‌ల్స్, సెలూన్ల సిబ్బంది, కూర‌గాయ‌ల వ్యాపారులు, కిరాణా దుకాణ‌దారులు, హ‌మాలీల‌కు టీకాలు వేయాల‌ని నిర్ణయించింది. గ్యాస్ డెలివరీ బాయ్స్.. రేష‌న్ దుకాణాల డీల‌ర్లు, పెట్రోల్ పంప్ వ‌ర్కర్లు, పండ్లు, పూలు అమ్ముకునే వారు, నాన్ వెజ్ మార్కెట్లలో ఉండేవారికి టీకా కోసం స్పెషల్ డ్రైవ్ చేప‌ట్టాల‌ని నిర్ణయించారు. జనాలు ఎక్కువగా చేరే లిక్కర్‌ షాప్‌ నిర్వాహకులను సూపర్‌ స్ప్రెడర్స్‌గా గుర్తించింది ప్రభుత్వం. ముందుగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో మద్యం అమ్మకందారులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత క్రమంలో వీరికి వ్యాక్సిన్ ఇస్తారు. వైద్య సిబ్బంది స్వయంగా వారి వ‌ద్దకే వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

దీంతో పాటు.. పని ప్రదేశాల్లో 18 ఏళ్ళు దాటిన వారికి వ్యాక్సినేషన్ నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రైవేట్ సంస్థలు వాక్సినేషన్ కోసం ప్రైవేట్ ఆస్పత్రులతో కోఆర్డినేట్ చేసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 58వేల కోవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. ఇక కోవిషీల్డ్ డోసులు 2 లక్షల 42 వేలు అందుబాటులో ఉండగా.. సోమవారం రాత్రి మరో 2 లక్షల 45 వేల డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి. వాటిలో నుంచి మంగళవారం వ్యాక్సినేషన్ కోసం డోసులను ఉపయోగించారు.