టపాసులు కాల్చుకునేందుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

10TV Telugu News

supreme court green signal for crackers in telangana state : తెలంగాణ రాష్ట్రంలో బాణా సంచా కాల్చటంపై ఉన్ననిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. క్రాకర్స్ కాల్చే విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును మారుస్తూ దీపావళి రోజు 2 గంటలపాటు టపాసులు కాల్చు కునేందుకు అవకాశం కల్పించింది. తెలంగాణలో గాలి నాణ్యత సాధారణంగా ఉండటంతో రెండు గంటలపాటు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు సుప్రీం అనుమతిచ్చింది.

గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలకు లోబడి బాణా సంచా కాల్చుకోవచ్చని స్పృష్టం చేసింది. గాలి నాణ్యతస్ధాయి తక్కువగా ఉన్న నగరాల్లో క్రాకర్స్ పై నిషేధాన్ని కొనసాగించాలని సుప్రీం సూచించింది. ఇక గాలి నాణ్యత మధ్యస్ధంగా ఉన్న నగరాల్లో గరిష్టంగా 2 గంటలపాటు బాణా సంచా కాల్చుకునేందుకు అనుమతిచ్చింది. గాలి నాణ్యత మెరుగ్గా ఉంటే స్ధానిక సంస్ధలే ఎంత సమయం కాల్చుకోవాలో నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది.తెలంగాణ రాష్ట్రంలో బాణా సంచా కాల్చటం పై నిషేధం విధిస్తూ గురువారం తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బాణాసంచా వ్యాపారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై అత్యవసరంగా విచారించిన సుప్రీం కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరిస్తూ గ్రీన్‌ క్రాకర్స్‌ కాల్చుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ ఆదేశాలు దీపావళితోపాటు, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు వర్తిస్తాయని సుప్రీం కోర్టు తెలిపింది.


దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, 122 నగరాల్లోని వాయు కాలుష్యం దృష్టిలో పెట్టుకుని ఎన్‌జీటీ నవంబర్9న ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. దీపావళి రోజు 2 గంటలపాటు టపాసులు కాల్చుకునేందుకు అవకాశం కల్పించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు బాణాసంచా కాల్చవచ్చని అనుమతి మంజూరు చేసింది.


సుప్రీంకోర్టు తీర్పుతో బాణసంచా వ్యాపారులకు ఊరట లభించింది. కాగా కరోనా వైరస్‌ నేపథ్యంలో క్రాకర్స్‌ను నిషేధిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించిన విషయ తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వ్యాపారులు సుప్రీంకోర్టలో శుక్రవారం లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారించిన న్యాయస్థానం రెండు గంటల పాటు గ్రీన్‌ క్రాకర్స్‌ కాల్చేందుకు అనుమతినిచ్చింది. తదుపరి విచారణను నవంబర్ 16కు వాయిదా వేసింది.