తాను చనిపోతూ మరికొందరికి ప్రాణం పోసింది : ఆస్ట్రేలియాలో తెలంగాణ యువతి బ్రెయిన్‌డెడ్‌

తాను చనిపోతూ మరికొందరికి ప్రాణం పోసింది : ఆస్ట్రేలియాలో తెలంగాణ యువతి బ్రెయిన్‌డెడ్‌

Telangana girl brain dead in Australia : ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన విద్యార్థిని బ్రెయిన్‌డెడ్‌కు గురైంది. తమ కుమార్తెను ఉన్నత స్థానంలో చూడాలన్న తల్లిదండ్రుల ఆశలను విధి మధ్యలోనే తుంచి వేసినట్టయ్యింది. నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లికి చెందిన మల్లెపల్లి వెంకటరెడ్డి మాజీ సైనికోద్యోగి. ప్రస్తుతం డీఆర్‌డీఎల్‌లోని బ్రహ్మోస్‌ ప్రాజెక్ట్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆయన.. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట కేశవరెడ్డినగర్‌ కాలనీలో నివాసముంటున్నారు.

వెంకట్‌రెడ్డి కుమార్తె రక్షిత అస్ట్రేలియా సిడ్నీలోని ఐఐబీఐటీ యూనివర్సిటీలో ఎంఎస్‌ చేస్తోంది. గత నెల 31న సిడ్నీలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రక్షిత డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. రక్షిత బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్లు ప్రకటించారు. అవయవాలను దానం చేస్తే మరికొందరికి ప్రాణం పోయవచ్చని అక్కడి వైద్యులు రక్షిత తల్లిదండ్రులను సంప్రదించారు. కుమార్తె తమకు దూరమైనా ఆమె వల్ల పలువురికి జీవితాన్నిచ్చినట్లు అవుతుందని వారు అంగీకరించారు.

మృతదేహం నగరానికి రావడానికి వారం రోజులు పడుతుందని, అక్కడి తెలుగు వారు అన్ని రకాలుగా సహకరిస్తున్నారని రక్షిత తండ్రి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఘటకు ముందే రక్షిత తమతో మాట్లాడిందని..అంతలోనే ఇంతటి దారుణం జరిగిందని తల్లి కన్నీరుమున్నీరయ్యింది.