Telangana Lockdown : తెలంగాణకు తాళం.. లాక్‌డౌన్ మొదలైంది..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ మొదలైంది.. బుధవారం (మే 12) నుంచి 20 గంటల లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చేసింది. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణకు లాక్‌ వేసింది కేసీఆర్‌ సర్కార్‌. ఇవాళ ఉదయం 10 గంటల నుంచే లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

Telangana Lockdown : తెలంగాణకు తాళం.. లాక్‌డౌన్ మొదలైంది..

Telangana Lockdown Countdown In Statewide (1)

Telangana Lockdown Started Statewide : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ మొదలైంది.. బుధవారం (మే 12) నుంచి 20 గంటల లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చేసింది. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణకు లాక్‌ వేసింది కేసీఆర్‌ సర్కార్‌. ఇవాళ ఉదయం 10 గంటల నుంచే లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆర్టీసీ బస్సులు, మెట్రో సర్వీసులు నడిచాయి. రేపు (మే 13) గురువారం ఉదయం 6 గంటల వరకు పూర్తి ఆంక్షలతో తొలి రోజు లాక్ డౌన్ కొనసాగనుంది. తెలంగాణలో ఈ నెల 21 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. సైబరాబాద్ లో సీపీ సజ్జనార్ రంగంలోకి దిగారు. హైటెక్ సిటీ వద్ద లాక్ డౌన్ అమలును ఆయన పరిశీలిస్తున్నారు.

లాక్ డౌన్ అమల్లోకి రావడంతో ప్రజారవాణా నిలిచిపోయింది. డిపోలకు ఆర్టీసీ బస్సులు చేరుకున్నాయి. మెట్రో సర్వీసులు కూడా బంద్ అయ్యాయి. అత్యవసరాలు మినహా తెలంగాణ మొత్తం షట్ డౌన్ అయింది. 33 శాతం సిబ్బందితోనే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయి. ధాన్యం కొనుగోళ్లకు మినహాయింపు ఇవ్వగా ఉపాధి హామీ పనులకు యథాతధంగా కొనసాగనున్నాయి. టీకా కోసం వెళ్లేవారికి లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది. అత్యవసర సర్వీసులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది. వివాహాలకు 40 మంది, అంత్యక్రియలకు 20మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. సినిమా హాళ్లు, క్లబ్ లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్ మూతపడ్డాయి. అత్యవసర ప్రయాణానికి ఈ పాస్ తప్పనిసరిగా ఉండాలి. ఈ పాస్ కోసం వెబ్ సైటులో దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ సూచించారు.

లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉన్నా.. అత్యవసర వైద్యం కోసం వెళ్తున్న బాధితులు, వైద్యరంగంలో పనిచేసే వారి వాహనాలకు అనుమతి ఉంటుంది. నిత్యావసర వస్తువుల పాలు, కూరగాయలు, ఆహార సామగ్రి, డెయిరీ ప్రొడక్ట్స్‌ రవాణాకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. వైద్య రంగంలో ఫార్మాసూటికల్‌ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్‌ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు ఎప్పట్లానే కొనసాగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, వాటి సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వారి వాహనాలకు అనుమతించనున్నారు. ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయ పనులు, రైస్‌ మిల్లుల నిర్వహణ, ఫెర్టిలైజర్, సీడ్‌ షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతిచ్చింది తెలంగాణ సర్కార్. విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు పనిచేస్తాయి.

జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్‌ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి. కోల్డ్‌ స్టోరేజీ, వేర్‌ హౌసింగ్‌ కార్యకలాపాలు, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, ఉపాధిహామీ పనులపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పింది ప్రభుత్వం. ఐటీ, నాన్‌ ఐటీ, టెలికామ్‌, పోస్టల్, ఇంటర్నెట్‌ సర్వీసెస్‌కు అనుమతి ఉంటుంది. అయితే ప్రైవేట్‌ రంగాల్లో పనిచేసే వారికి వర్క్‌ ఫ్రం హోం సౌకర్యం కల్పించడం మంచిదని ప్రభుత్వం సూచించింది.