Telangana Politics : పాలమూరు పార్లమెంట్‌ సీటుపై ఆల్ పార్టీస్ ఫోకస్‌.. పాలమూరు బరిలో ప్రధాని మోడీ ఉంటారనే ప్రచారంలో నిజమెంత?

వచ్చే ఎన్నికల్లో పాలమూరు పార్లమెంట్‌ సీటుపై విజయం సాధించాలని ఆల్ పార్టీస్ ఫోకస్‌ పెట్టాయి.. పాలమూరు బరిలో ప్రధాని మోడీ లేదా అమిత్ షా ఉంటారనే ప్రచారంలో నిజమెంత? మోడీ, షాలే బరిలో దిగుతారు అంటూ మరి పాలమూరు రాజకీయాలు ఎంత ఫవర్ ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. పాలమూరు ఎంపీ సీటు ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎందుకు పాలమూరు ఎంపీసీటుపై అంత ఫోకస్?

Telangana Politics : పాలమూరు పార్లమెంట్‌ సీటుపై ఆల్ పార్టీస్ ఫోకస్‌.. పాలమూరు బరిలో ప్రధాని మోడీ ఉంటారనే ప్రచారంలో నిజమెంత?

Telangana Politics : మాములుగా ఉండదు మహబూబ్‌నగర్ రాజకీయం అనే పేరు ఉంది. ఓటర్ నాడి పట్టుకోవడం అంత ఈజీ కాదు ఇక్కడ ! అంచనాలకు మించి ఉంటుంది ఓటర్ తీర్పు ఇక్కడ ! కేసీఆర్‌ గెలిచి..
తెలంగాణ ఆశను నిలబెట్టింది ఇక్కడే ! ఇప్పుడు గెలిచి తెలంగాణపై పట్టు సాధించాలని బీజేపీ కోరుకుంటోంది ఇక్కడే ! పాత రికార్డులను కొత్తగా చూపించాలని కాంగ్రెస్‌ ఆశపడుతోంది ఇక్కడే !
అలాంటి పాలమూరు పార్లమెంట్‌పై పార్టీలన్నీ ఫోకస్‌ పెంచాయ్‌. ఒక్కో అడుగు ఆచీతూచీ వేస్తున్నాయ్. జనాలకు చేరువ కావడం నుంచి.. అభ్యర్థుల ఎంపిక వరకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాయ్. మోదీ లేదా అమిత్ షా ఇక్కడి నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతుండడం.. రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇద్దరిలో ఒకరు ఇక్కడి నుంచి నిజంగా పోటీ చేస్తారా.. బీజేపీ వ్యూహాలు ఏంటి.. మహబూబ్‌నగర్‌పై బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంటుందా.. కాంగ్రెస్‌ ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ఏ పార్టీ ఎక్కడ బలంగా ఉంది.. పాలమూరు ఫైట్‌లో మూడు పార్టీల నుంచి బరిలో నిలవబోయే రేసుగుర్రాలు ఎవరు..

దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయంగా ఎప్పుడూ ప్రత్యేకమే ! ఇక్కడి జనాలు ఎప్పుడు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో అంచనా వేయడం కష్టమే. కాంగ్రెస్,
టీఆర్ఎస్, బీజేపీ.. మూడు పార్టీలు జిల్లాలో ఉనికి చాటుకున్నాయ్. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట అయిన మహబూబ్‌నగర్ ఇప్పుడు గులాబీ పార్టీ హస్తగతం చేసుకుంది. మధ్యలో బీజేపీ కూడా
మెరిసింది. రెండోదశ తెలంగాణ ఉద్యమానికి ముందు కేసీఆర్‌ పార్లమెంట్‌కు వెళ్లింది ఇక్కడే.. ఇప్పుడు మోదీ బరిలో దిగుతారంటూ ప్రచారం జరుగుతోంది కూడా ఇక్కడే ! పాతరోజులు
తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది ఇక్కడే ! దీంతో పాలమూరు రాజకీయం ఆసక్తికరంగా మారింది.

మహబూబ్‌నగర్‌ సిట్టింగ్‌ ఎంపీగా మన్నె శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలోనూ కారు పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. 2009లో కేసీఆర్ ఇక్కడి నుంచి విజయం సాధించగా… 2014, 2019లోనూ గులాబీ పార్టీ జోరే కనిపించింది. 2024లో బీఆర్ఎస్ తరఫున మన్నె శ్రీనివాస్ రెడ్డి మరోసారి పోటీ చేసేందుకు రెడీ అవుతుండగా… బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయాధ్యక్షురాలు డీకే అరుణ మళ్లీ పోటీలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయ్. గతంతో పోల్చుకుంటే బీజేపీ భారీగా బలం పుంజుకుంది. దీంతో డీకే అరుణ విజయంపై ధీమాగా ఉన్నారు. ఇక్కడ తాను గెలిచి.. కేంద్రంలో మళ్లీ బీజేపీ గెలిస్తే.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని డీకే అరుణ భావిస్తున్నారు. ఆమె పార్లమెంట్‌కు వెళ్తే.. కేంద్ర కేబినెట్‌లోనూ బెర్త్ కన్ఫార్మ్ అయ్యే చాన్స్ ఉందనే ప్రచారం జోరుగ సాగుతోంది. ఐతే మరోవైపు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా బీజేపీ తరఫున బరిలో దిగాలని పావులు కదుపుతున్నారు. గతంలో ఒకసారి బీజేపీ నుంచి, మరోసారి టీఆర్ఎస్‌ నుంచి ఆయన విజయం సాధించారు. దీంతో మరోసారి ఇక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ కూడా ఇక్కడి నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి.. విజయం సాధించి పాలమూరుపై మళ్లీ పట్టు సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచందర్ రెడ్డి పోటీ చేయగా.. ఈసారి కూడా మళ్లీ ఆయనే అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ కూడా ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో.. ఎంపీ సీటు ఎలాగైనా గెలిచి తీరాలని కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం అవుతున్నాయ్. సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి జనాలకు చేరువ కాలేకపోయారన్న విమర్శలు ఉన్నాయ్. ఇక మహబూబ్‌నగర్ పార్లమెంట్‌ నుంచి మోదీ బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇదే ప్రచారమే అయినా.. ఎన్నికల నాటికి రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏమైనా ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్‌ ఖాయంగా కనిపిస్తోంది. ఐతే అసెంబ్లీ ఫలితాల ఆధారంగా.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయ్.

పాలమూరు పార్లమెంట్‌ పరిధిలో మహబూబ్‌నగర్‌తో పాటు కొడంగల్‌, నారాయణపేట్‌, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్‌, షాద్‌నగర్ నియోజకవర్గాలు ఉన్నాయ్. మహబూబ్‌నగర్ అసెంబ్లీ పరిధిలో ఓటర్ల తీర్పు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన ఆయన.. హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. నియోజకవర్గంపై పట్టు సాధించడంతో పాటు అభివృద్ధిలోనూ తనదైన మార్కు వేసుకోవడం శ్రీనివాస్‌ గౌడ్‌కు కలిసొచ్చే అంశం. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులు లేకపోవడం శ్రీనివాస్ గౌడ్‌కు పెద్ద ప్లస్‌. ఐతే ఆయన అనుచరుల దందాలు, అవినీతి ఆరోపణలు ఇబ్బందిగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్. కమలం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నా.. నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లు ఎక్కువగా ఉండడం బీజేపీని కలవరపెడుతోంది. డీకే అరుణ ఇక్కడి నుంచి అసెంబ్లీ బరిలో నిలిస్తే బాగుంటుందని.. పార్టీ శ్రేణులు భావిస్తున్నాయ్. కాంగ్రెస్‌ పార్టీ నుంచి రేసులో పెద్దగా పేర్లు వినిపించడం లేదు. బలమైన అభ్యర్థి కోసం పార్టీ నేతలు అన్వేషణ మొదలుపెట్టారు. ఇతర నియోజకవర్గాలకు చెందిన కొంతమంది నేతల పేర్లు వినిపిస్తున్నా.. ఇక్కడికి వచ్చి ఓటర్లను ప్రభావితం చేయలేకపోతారనే చర్చ జరుగుతోంది.

దేవరకద్రలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఈయన కూడా హ్యాట్రిక్ విజయం టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు అభివృద్ధిలోనూ తనదైన మార్క్ వేసుకున్నారు ఆల. బీఆర్ఎస్‌ నుంచి మళ్లీ ఈయనకే టికెట్ కన్ఫార్మ్‌. ఇక్కడ కాంగ్రెస్‌, టీడీపీలో టికెట్ ఫైట్‌గా భారీగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డితో పాటు కాటం ప్రదీప్ గౌడ్ పోటీ పడుతున్నారు. ఇద్దరు నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తుండడంతో.. కేడర్ కన్ఫ్యూజన్‌లో పడింది. బీజేపీలోనూ ఇదే సమస్య కొనసాగుతోంది. డోకూరు పవన్ కుమార్, ఎగ్గని నర్సింహులు, దేవరకద్ర బాలన్న టికెట్‌ రేసులో ఉన్నారు. దీంతో ఎవరికి టికెట్‌ వరిస్తుందన్న ఆసక్తికరంగా మారింది. ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు పార్టీ కోసం పనిచేస్తారే లేదో అనే టెన్షన్ కనిపిస్తోంది. ఇది బీఆర్ఎస్‌కు లాభించే అంశం అనే అంచనాలు వినిపిస్తున్నాయ్.

కొడంగల్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఒకప్పుడు గెలిచిన నియోజకవర్గం కావడం.. ఇప్పుడు కాంగ్రెస్ పట్టు మీద కనిపిస్తుండడం.. రాజకీయాన్ని ఆసక్తికరంగా మారుస్తోంది. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా పట్నం నరేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో మొదటిసారి గెలిచిన ఆయన గెలిచి.. ప్రతీ క్షణం అందుబాటులో ఉంటూ జనాలకు దగ్గరయ్యారు. అధికార పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ చేసిన నియోజకవర్గాల్లో కొడంగల్ ఒకటి ! కొడంగల్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు కోల్పోకుండా చూసుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంటే.. పోయి చోటే వెతుక్కోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. రేవంత్ రెడ్డి.. మరోసారి ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్‌.. కొడంగల్ మీద పెద్దగా ఫోకస్‌ పెట్టలేదు. కేడర్‌ చాలావరకు బీజేపీలో చేరిపోయింది. దీంతో కొడంగల్‌ మీద మళ్లీ దృష్టిసారిస్తున్న రేవంత్‌.. వరుస పర్యటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అసంతృప్త నేత గుర్నాథ్‌ రెడ్డిని స్వయంగా వెళ్లి రేవంత్‌ కలవడం.. రాజకీయాలను హీటెక్కించింది. ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న రేవంత్, గుర్నాథ్ రెడ్డి కలిస్తే.. గులాబీదళానికి చిక్కులు తప్పకపోవచ్చు. ఇక్కడ బీజేపీ పెద్దగా ప్రభావం చూపించే అవకాశం కనిపించడం లేదు. దీంతో బలమైన అభ్యర్థి కోసం కమలం పార్టీ అన్వేషిస్తోంది.

మక్తల్‌లో చిట్టెం రామ్మోహన్ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచిన చిట్టెం.. 2018 ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌లో చేరారు. కమలానికి, కారు మధ్య రసవత్తర పేరు జరగబోయే నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. బీఆర్ఎస్‌ నుంచి మళ్లీ తనకే టికెట్ ఖాయం అని చిట్టెం రామ్మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో మక్తల్‌ ఒకటి. ఇక్కడ ఎలాగైనా గెలిచి తీరాలని కమలం పార్టీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ బరిలో నిలిచి గట్టి పోటీ ఇచ్చిన జలంధర్ రెడ్డి.. ఇప్పుడు బీజేపీలో చేరడం మరింత కలిసి రానుంది. బీజేపీ ఓటుబ్యాంక్‌, వ్యక్తిగత ఓటు బ్యాంక్‌ తనకు కలిసొచ్చే అవకాశం ఉందని జలంధర్‌ అంచనా వేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చెప్పుకోదగ్గ నేత లేరు. ఐతే ఎన్ఆర్ఐతో పాటు స్థానికంగా ఉండే శ్రీహరి, ప్రశాంత్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.

నారాయణపేటలో రాజేందర్ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన ఆయన.. 2018కి ముందు గులాబీ పార్టీలో చేరి పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గంపై రాజేందర్‌ రెడ్డికి మంచి పట్టు ఉంది. అభివృద్ధితోనూ జనాల మనసు గెలుచుకున్నారు. ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో కనిపిస్తున్నారు. నారాయణపేట నియోజకవర్గ రాజకీయాలపై బీఆర్ఎస్‌ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కర్ణాటకకు సరిహద్దులో ఉన్న నియోజకవర్గం కావడంతో.. ఆ రాష్ట్రంపై పార్టీ ప్రభావం చూపేలా అధిష్టానం దృష్టి సారించింది. బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో నారాయణపేట కూడా ఒకటి. కమలం పార్టీ నుంచి టికెట్ రేసులో రతంగ్ పాండు రెడ్డి, నాగురావ్ నామోజి పేర్లు వినిపిస్తున్నాయ్. కాంగ్రెస్‌కు కూడా ఇక్కడ బలం ఉన్నా.. గత ఎన్నికల్లో పోటీ చేసిన శివకుమార్.. ఇప్పుడు పార్టీకి, ప్రజలకు దూరంగా ఉంటున్నారు. దీంతో రోజురోజుకు పార్టీ వీక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న షాద్‌నగర్ నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ హాట్‌హాట్‌గానే ఉంటాయ్. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న అంజయ్య యాదవ్‌.. హ్యాట్రిక్ విజయం మీద కన్నేశారు. షాద్‌నగర్‌లో బీసీ ఓట్లు ఎక్కువ. ఈ ఓటు బ్యాంక్‌పై పట్టు సాధించడంలో అంజయ్య యాదవ్‌ తన మార్క్ చూపించారు. ఐతే వర్గపోరు ఇక్కడ బీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతోంది. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన ప్రతాప్ రెడ్డి..ప్రస్తుతం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. టికెట్ తనకే అని ప్రతాప్ రెడ్డి ధీమాతో కనిపిస్తున్నారు. దీంతో అంజయ్య యాదవ్‌, ప్రతాప్‌ రెడ్డి వర్గాల మధ్య యుద్ధం పీక్స్‌కు చేరింది. ఈ పంచాయితీ అధిష్టానం వరకు వెళ్లింది. దీంతో గులాబీ పార్టీ హైకమాండ్‌ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ కాస్త వీక్ అయ్యాయ్. బలమైన నేతలు రెండు పార్టీలుక మైనస్‌. కాంగ్రెస్ నుంచి టికెట్‌ రేసులో వీర్లపల్లి శంకర్, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయ్. బీజేపీ నుంచి శ్రీవర్ధన్ రెడ్డి బరిలో దిగేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్‌ రెడ్డిషాద్‌నగర్ మీద పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చివరి నిమిషంలో ఆయన పేరు కూడా టికెట్ రేసులో వినిపించే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీకు పెద్దగా బలం లేకపోయినా.. బీఆర్ఎస్‌లో గ్రూప్‌ వార్‌ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

జడ్చర్లలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నారు. పార్టీ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న లక్ష్మారెడ్డి మళ్లీ బరిలోకి దిగడం ఖాయం. ఇక్కడ విజయంపై ఆయన ధీమాగా ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీ కేడర్‌ను బలోపేతం చేయడంలో సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ కూడా ఇక్కడ బలంగా ఉంది. ఐతే వర్గపోరు హస్తం పార్టీని టెన్షన్ పెడుతోంది. కాంగ్రెస్ ఇక్కడ మూడు వర్గాలుగా విడిపోయిందనే చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, అనిరుధ్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. ఈ మధ్యే కాంగ్రెస్‌లో చేరిన ఎర్ర శేఖర్‌ను.. అనిరుధ్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీసీ సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గం కావడంతో.. కాంగ్రెస్ అధిష్టానం ఎర్ర శేఖర్ వైపు మొగ్గు చూపుతుందనే టాక్ నడుస్తోంది. టికెట్ దక్కని ఆ ఇద్దరు ఎలాంటి నష్టం చేస్తారనే టెన్షన్‌ సొంత పార్టీలోనే వినిపిస్తోంది. బీజేపీకి ఇక్కడ ఓటుబ్యాంక్ ఉన్నా.. బలమైన అభ్యర్థి లేకపోవడం కమలం పార్టీకి మైనస్‌గా మారింది.

రోజుకో మలుపుతో మహబూబ్‌నగర్ రాజకీయం ఆసక్తి రేపుతోంది. పాలమూరు అంటేనే విలక్షణతకు మారుపేరు అన్నట్లుగా కనిపస్తారు ఇక్కడి ఓటర్లు. పార్టీల అంచనాలు అంత ఈజీగా నిజం కావు ఇక్కడ ! దీంతో మహబూబ్‌నగర్ పార్లమెంట్‌ను కైవసం చేసుకోవాలని మూడు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నారు. 2009లో మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా గెలిచిన కేసీఆర్‌.. ఆ తర్వాత గులాబీ పార్టీ దశనే మార్చేశారు. తెలంగాణలో అధికారం కోసం పావులు కదుపుతున్న బీజేపీ.. ఇప్పుడు అలాంటి వ్యూహమే అమలు చేస్తోంది. మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానం గెలిచి.. తెలంగాణలో బీజేపీని తిరుగులేని శక్తిగా మార్చాలనే వ్యూహంతో కనిపిస్తోంది. అందుకోసం భారీ కసరత్తు చేస్తోంది. ఇక దక్షిణాది నుంచి మోదీ బరిలో దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారని.. అందులో మహబూబ్‌నగర్‌ కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. మోదీ కాకపోతే అమిత్‌ షా అయినా పోటీలో నిలుస్తారనే ప్రచారం.. బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఇక అటు కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సొంత ఇలాఖాలో పట్టు సాధించాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్ పావులు కదుపుతున్నారు.