నేడు, రేపు తెలంగాణలో వడగాల్పులు

  • Published By: murthy ,Published On : May 25, 2020 / 01:54 AM IST
నేడు, రేపు తెలంగాణలో వడగాల్పులు

రోహిణీ కార్తె మొదలవటంతో భానుడి భగభగలకు ప్రజలు విలవిలజలాడి పోతున్నారు.  ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్‌ లోని  వాతావరణ కేంద్రం  అధికారులు తెలిపారు. ఉత్తర భారతం నుంచి రాష్ట్రంపైకి వేడిగాలులు, పొడిగాలులు వస్తున్నాయని, ముఖ్యంగా రాజస్తాన్‌ నుంచి ఈ గాలులు వస్తుండటంతో తెలంగాణలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు వీస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది. 

అలాగే ఉంపన్‌ తుపాను వెళ్లిపోవడంతో తేమ కూడా దాంతోపాటు వెళ్లిపోయిందని, ఫలితంగా రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ రెండు కారణాలతో రాష్ట్రంలో వడగాడ్పులు వీస్తున్నాయన్నారు.  

సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని  వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగనున్నట్లు పేర్కొంది. ఆ ద్రోణి వస్తే తేమ గాలులు వస్తాయని, అప్పుడు కాస్తంత వేడి తగ్గుతుందని తెలిపింది.

కాగా….. ఎండ వేడికి తోడు ఉత్తరాది నుంచి వీస్తున్న వడగాడ్పులతో  ఆదివారం వివిధ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా జైనద్‌లో 46.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. అదే విధంగా మంచిర్యాల, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల్లోనూ 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డయింది. 

నిజామాబాద్ 44.9, నల్లగొండ 44.5, మెదక్ 44.3, రామగుండం 44.2, మహబూబ్ నగర్ 43.2, ఖమ్మం 42.6, హన్మకొండ 42.5, హైదరాబాద్ 42.4, భద్రాచలం లో 41.2 డిగ్రీల  సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. 

మరో వైపు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఆదివారం 51 డిగ్రీల సెల్సియస్‌ రికార్డు ఉష్ణోగ్రత నమోదైనట్లు కేటీపీపీలోని ఉష్ణోగ్రత పట్టికలో చూపింది. కానీ ఈ వివరాలను హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు ధ్రువీకరించలేదు.

Read: హైదరాబాద్ లో సూర్యుడి ప్రతాపం : 44 – 46 ఉష్ణోగ్రతలు