Nagarjunasagar by-election : నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక.. అభ్యర్థులను ఖరారు చేయని టీఆర్‌ఎస్‌, బీజేపీ

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు నామినేషన్లు ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల‌ను ఖ‌రారు చేయ‌లేదు.

Nagarjunasagar by-election : నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక.. అభ్యర్థులను ఖరారు చేయని టీఆర్‌ఎస్‌, బీజేపీ

Nagarjunasagar By Election

Nagarjunasagar by-election : నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లు అన్ని పార్టీల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తున్నాయి. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు నామినేషన్లు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థి జానారెడ్డి అని ప్రక‌టించి రేసులో ముందుంది. టీఆర్ఎస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల‌ను ఖ‌రారు చేయ‌లేదు. నామినేషన్లు ప్రారంభమైన ఇంకా ఎవ‌రిని బరిలో దించాల‌న్న దానిపై నిర్ణయం తీసుకోలేదు. కేసీఆర్, బండి సంజయ్‌ అభ్యర్థి ఎంపికపై అనేక లెక్కలు బెరీజులు వేస్తున్నారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయడంపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తుది కసరత్తు చేస్తోంది. బలమైన నేతగా గుర్తింపు పొందిన జానారెడ్డిని ఎదుర్కొనేందుకు ధీటుగా అభ్యర్థిని నిలబెట్టాలని గులాబీ పార్టీ భావిస్తోంది. గులాబీ పార్టీ నుంచి పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున నేతలు ఆశలు పెంచుకున్నారు.

ఇటీవల జరిగిన మండలి ఎన్నికల్లో అధికార పార్టీ రెండు స్థానాలు కైవసం చేసుకోవడంతో ఈ స్థానంలో కూడా విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ ప్రచారం మొదలు పెట్టింది. జానారెడ్డిని ఎదుర్కొనేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలో దించాలా…. లేక గతంలో జానారెడ్డి పై విజయం సాధించిన యాదవ సామాజిక వర్గాన్ని బరిలో దించాలా అన్న అంశంపై పార్టీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

రెడ్డి సామాజిక వర్గాన్ని బరిలో దించాలని భావిస్తే ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డికి పోటీ చేసేందుకు అవకాశం దక్కవచ్చని అంటున్నారు. బీసీ సామాజికవర్గం నుంచి అభ్యర్థిని ఖరారు చేయాలంటే నోముల భగత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే సమయంలో రంజిత్ యాదవ్ లేదంటే గురువయ్య యాదవ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. నేడో రేపో అభ్యర్థిని పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేసే అవకాశం ఉంది.

ఇక బీజేపీ పార్టీ మాత్రం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రక‌టించిన త‌రువాత‌నే త‌మ అభ్యర్థి ప్రకట‌న ఉంటుంద‌ని కాషాయ నేత‌లు చెబుతున్నారు. దీంతో బీజేపీ నుండి టికెట్ ఆశిస్తున్న వారిలో టెన్షన్ మొద‌లైంది. ఇప్పటికే నియోజ‌క వ‌ర్గాన్ని ఆశావాహులంతా ఓ రౌండ్ వేసి వ‌చ్చారు. పాత నాయ‌కులు, కొత్త నాయకులు పోటీ ప‌డి ప్రచారం నిర్వహించారు.

నాగార్జున సాగ‌ర్ లో బీజేపీ ఇప్పటి వ‌ర‌కు పెద్దగా ప్రభావం చూపింది లేదు. చెప్పుకోద‌గ్గ ఓట్లు కూడా ఎప్పుడూ రాలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ బలంగా ముందుకు దూసుకు వ‌చ్చింది. దుబ్బాక, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో కూడా టీఆర్ఎస్ పార్టీని బీజేపీ తీవ్రంగా దెబ్బతీసింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఒడిపోయినా బీజేపీకి వ‌చ్చిన ఓట్లతో నైతిక విజ‌యం మ‌న‌దే అంటూ బీజేపీ కార్యక‌ర్తల‌ను ఉత్సాహ ప‌రుస్తోంది.

అయితే అభ్యర్థిని ఖరారు చేసే విష‌యంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. బల‌మైన నాయ‌కున్ని బరిలో దింప‌క పోతే ఇబ్బంది త‌లెత్తే ప్రమాదం ఉంద‌ని భావిస్తోంది. ఇప్పటికే ప‌లుమార్లు ఇదే అంశంపై కోర్ క‌మిటీ స‌మావేశాలు నిర్వహించింది. ఆశావాహుల పేర్లను ప‌రిశీలించింది. అయితే విష‌యం ఎటూ తేల‌కపోవ‌డంతో ఈ అంశం హ‌స్తిన‌కు చేరింది. జాతీయ నాయ‌కుల ముందు ఆశావాహుల పేర్లు వారి బలాబలాల‌ను ఉంచాల‌ని బండి సంజయ్‌ భావిస్తున్నారు. నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌డంతో ఇక త్వరగా అభ్యర్థిని ఫైనల్ చేసి.. ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేయాల‌ని భావిస్తోంది.