Kolkata Incident: కోల్‌కతా ఘటనతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్.. ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ బందోబస్తు..
ఈ మ్యాచ్ నేపథ్యంలో 3వేల మంది భద్రతా ఏర్పాట్లు చేశారు. టికెట్లు లేనిదే స్టేడియంలోకి రావొద్దని పోలీసులు సూచించారు.
Kolkata Incident: కోల్ కతా ఘటనతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పటిష్ట చర్యలు చేపట్టారు. కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియం నుంచి మెస్సీ త్వరగా వెళ్లిపోవటంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు. కుర్చీలు, వాటర్ బాటిల్స్ ను స్టేడియంలోకి విసిరారు. హైదరాబాద్ లో అలాంటి పరిస్థితి రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మెస్సీ, సీఎం రేవంత్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో 3వేల మంది భద్రతా ఏర్పాట్లు చేశారు. టికెట్లు లేనిదే స్టేడియంలోకి రావొద్దని పోలీసులు సూచించారు.
రాత్రికి ఉప్పల్ స్టేడియంకు రానున్న ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ.. 40 నిమిషాల పాటు స్టేడియంలో అభిమానుల మధ్య గడపనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. స్టేడియం దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 3వేల 500 వరకు పోలీసులు బందోబస్తులో ఉన్నారు. 450 కెమెరాలతో నిఘా పెట్టారు. డ్రోన్ కెమెరాలను కూడా అరేంజ్ చేశారు. మఫ్టీలో పోలీసులను పెట్టారు.
టికెట్లు కొనుగోలు చేసిన వారు మాత్రమే స్టేడియం దగ్గరికి రావాలని పోలీసులు సూచించారు. టికెట్లు కొనుగోలు చేయని వారు మెస్సీని స్టేడియం బయటి నుంచి చూడొచ్చు. అయితే, అలాంటి ఆశలు ఎవరూ పెట్టుకోవద్దని పోలీసులు తేల్చి చెప్పారు. టికెట్లు కొనుగోలు చేయని వారు అసలు స్టేడియం దగ్గరికి రావొద్దన్నారు. ఉప్పల్ స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు పోలీసులు.
25వేల మంది వచ్చి మ్యాచ్ ని వీక్షించేలా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించారు. టికెట్లు కొనుగోలు చేసి స్టేడియంకు వచ్చే వారు తమ సొంత వాహనాల్లో కాకుండా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో (మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు) రావడం ఉత్తమం అని పోలీసులు తేల్చి చెప్పారు. పార్కింగ్ కు ఇబ్బందులు తలెత్తవచ్చని, కాబట్టి సొంత వాహనాల్లో కాకుండా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.
