శుక్రవారం కూడా వర్షాలు   

  • Published By: chvmurthy ,Published On : January 3, 2020 / 01:16 AM IST
శుక్రవారం కూడా వర్షాలు   

ఈశాన్యం, దక్షిణం వైపు నుంచి వీస్తున్న గాలుల వల్ల ఏర్పడిన కాన్‌ఫ్లంట్‌ జోన్‌ ప్రభావంతో గ్రేటర్‌లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాన్‌ఫ్లంట్‌ జోన్‌ ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు. 

గురువారం జనవరి2 ఉదయం నుంచి రాత్రి 7గంటల వరకు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని బేగంపేట్‌ సర్కిల్‌ పరిధిలోని మోండా మార్కెట్‌ ఏరియాలో 5.23 సెంటీమీటర్లు, ఐఎండీ కార్యాలయం ఏరియాలో 4.30, సీతాఫల్‌మండిలో 3.78, ఉప్పల్‌లో 3.40, మల్కాజ్‌గిరిలో 3.15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట్‌లో 2.58 సెం.మీ, వేములవాడలో 1.08 సెం.మీ, నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం, జగిత్యాల జిల్లా బీర్పూర్‌, సిరిసిల్ల, గజ్వేల్‌, దుబ్బాక, తాంసి తదితర ఇతర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. శుక్రవారం కూడా రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.  

హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి సాయంత్రం 5.30గంటల వరకు గరిష్ట ఉష్ణోగ్రత 29.0డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20.4డిగ్రీల సెల్సియస్‌, గాలిలో తేమ 95శాతంగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Also Read : రాజధాని రైతులకు పోలీసుల నోటీసులు