సొంతూరు ప్రజలకు సమ్మక్క ఎలాంటి శాపనార్దాలు పెట్టింది..? 

  • Published By: sreehari ,Published On : February 3, 2020 / 04:34 PM IST
సొంతూరు ప్రజలకు సమ్మక్క ఎలాంటి శాపనార్దాలు పెట్టింది..? 

బయ్యక్కపేటలోనే ఉండాలని సమ్మక్క కోరుకుందా..? గిరిజనులు అంతా ఏకమై ఆ వనదేతను మేడారానికి పంపించారా..? ఈ క్రమంలోనే సమ్మక్క ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది..? సొంతూరు ప్రజలకు ఎలాంటి శాపనార్దాలు పెట్టింది..? అంటే.. సమ్మక్క సొంత ఊరు బయ్యక్కపేటలో ఆమె వంశీయులు ఒకానోక దశలో ఆర్థికంగా చితికిపోయారు.

కరువు కాటకాలతో తినడానికి తిండిలేని పరిస్థితులు దాపురించాయి. తమ ఇష్టదైవమైన  సమ్మక్కను కొలవలేని దుస్థితిలో కొట్టుమిట్టాడారు. చివరకు ఉత్సవాల నిర్వహణ వారికి భారమైంది. ఈ క్రమంలోనే చందా వంశంలోని దాయాదులకు తీవ్రమైన బేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో సమ్మక్కకు సంబంధించిన ఆనవాళ్లను చందా వంశీయులు మూడు భాగాలుగా చేసుకున్నారు.

గిరిజనులకు సమ్మక్క సవాల్ :
ఒక వర్గం బయ్యక్కపేటకే పరిమితం కాగా, మరో వర్గం ఖమ్మం జిల్లాకు.. ఇంకో వర్గం మహారాష్ట్రలోని చాందా  గ్రామానికి వెళ్లారు. ఖర్చులు భరించలేని పరిస్థితిలో అమ్మ పూజారులైన వడ్డెలు.. మేడారానికి సమ్మక్కను సాగనంపారు. పుట్టింటి నుంచి బలవంతంగా మేడారం పంపించడం సమ్మక్కకు ఏమాత్రం ఇష్టం లేదు. తాను వెళ్లబోనని ఎంత చెప్పినా గిరిజనులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సమ్మక్క.. గిరిజనులను తీవ్రంగా శపించినట్టు పూర్వీకులు, పరిశోధకులు చెబుతున్నారు. బలవంతంగా వెళ్లగొడుతున్నారు కనుకే దేదీప్యమానంగా వెలుగొందుతానని గిరిజనులతో సమ్మక్క సవాల్‌ చేసిందనే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. 

ఏడు విడిచి ఏడు జాతర జరుపుకోవడం ఆనవాయితీ : 
అలాగే రెండేళ్లకోసారి జాతర జరగడానికి కూడా కారణం ఉంది. సమ్మక్క వంశీయులు మూడు వర్గాలు విడిపోయి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు. ఒకేసారి అందరూ జాతర జరుపుకుంటే ఒకరినొకరు  కలవరని.. ఒక దగ్గర జరిగే జాతరకు మరో ప్రాంతంలో ఉండే వాళ్లు వచ్చేలా ఏడు విడిచి ఏడు జరుపుకుంటున్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు.

ప్రతీ మేడారం జాతరకు చందా వంశీయులైన  సిరిమల్లేవాసులు వేడుకల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. సంప్రదాయం ప్రకారం.. మేడారం జాతర అనంతరం బయ్యక్కపేటలో తిరుగు వారం పండుగను ఘనంగా నిర్వహిస్తారు. తిరుగు వారం అంటే.. జాతర ముగిసిన తర్వాత 16 రోజులకు వచ్చే గురువారం నాడు సమ్మక్కకు తిరుగవారం చేస్తారు. 

తిరుగు వారానికి ఒక రోజు ముందు అంటే బుధవారం ఈ గ్రామ ప్రజలు ఇంటికొక్కరు తల స్నానం చేసి అడవికి వెళ్లి రెల్లుగడ్డి కోసుకుని వచ్చి గుడిపై కప్పుతారు. అదే రోజు గుడిని శుభ్రం చేస్తారు. సమ్మక్కను చందా వంశపు వారి ఇంటి నుంచి సిద్దబొయిన పూజారితో కొమ్ము డప్పు, బాజాలతో చిందులు వేస్తూ బయ్యక్కపేట వాసులు దేవతను  ఊరేగింపుగా గుడికి తీసుకువస్తారు.

అమ్మవారిని గుడికి తీసుకువచ్చే క్రమంలో దేవరగుట్టపై నాగలకాడి లావుతో ఒక మెరుపు మెరుస్తుందని నమ్ముతారు. ఇలా ఇప్పటికీ బయ్యక్కపేటలో నేటి మేడారం గిరిజన జాతర సంస్కృతి సంప్రదాయాలు కొనసాగుతూనే ఉన్నాయి.