ఈసారైనా, కోదండరాం సారు చిరకాల కోరిక నెరవేరేనా?

  • Published By: naveen ,Published On : September 15, 2020 / 04:32 PM IST
ఈసారైనా, కోదండరాం సారు చిరకాల కోరిక నెరవేరేనా?

కోదండరాం… ఈ పేరు తెలంగాణ రాజకీయ, సామాజికవేత్తలకు సుపరిచితం. తెలంగాణ మలి దశ ఉద్యమం నుంచి తెరపైకి వచ్చిన కోదండరాం.. వృత్తి రీత్యా ప్రొఫెసర్‌. కొలువు నుంచి రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలపై సారుకు మనసు పడిందట. చట్టసభల్లో అడుగు పెట్టాలని చాలా కాలంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా తన సారథ్యంలోనే ఏకంగా పార్టీ పెట్టేశారు. తెలంగాణ జన సమితి పేరుతో ఏర్పాటు చేసిన పార్టీ తాను అనుకున్న స్థాయిలో జనంలోకి వెళ్లలేదు.

కాంగ్రెస్‌తో జతకట్టినా ప్రయోజనం లేకపోయింది:
చట్టసభల్లో అడుగు పెట్టాలనే ఆలోచనతో గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో జతకట్టినా ప్రయోజనం లేకపోయింది. తాను పోటీ చేయాలనుకున్న జనగామ అసెంబ్లీ స్థానం నుంచి పరిస్థితులు అనుకూలించక పోవడంతో కాంగ్రెస్ పార్టీకే వదిలేశారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండానే ఉండిపోవలసి వచ్చింది.


కానీ తన మనసులో కోరిక మాత్రం అలాగే ఉండిపోయిందట. ఎలాగైనా చట్టసభల్లో అడుగు పెట్టాలనుకుంటున్న సారుకు.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కలసి వచ్చాయి. పట్టభద్రుల నియోజకర్గ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఎలాగైనా గెలిచేందుకు కొత్త కొత్త వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.

సొంతంగా బలం పెంచుకోవడానికి స్కెచ్:
త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాలని డిసైడ్ అయ్యిందే ఆలస్యం అందరినీ కలుపుకొని వెళ్లేందుకు చర్యలు మొదలుపెట్టేశారు. అందుకోసం తనకు గతంలో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, వామపక్షాలతో సంప్రదింపులు చేశారు.


కాంగ్రెస్ నుంచి మాత్రం ఇంకా రెస్పాన్స్ రాలేదంట. సో తన కోరిక నెరవేరాలంటే.. సొంతంగా బలం పెంచుకోవాలని చూస్తున్నారట. అందుకోసం తాజాగా స్కెచ్ వేశారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక కావడంతో నిరుద్యోగ సమస్యను ప్రస్తావించాలని డిసైడ్‌ అయ్యారు.

నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహం:
నిరుద్యోగ సమస్యను టేకప్ చేసి జనంలోకి వెళ్లాలని నిర్ణయించడమే ఆలస్యం.. వెంటనే దానిని ఈ సోమవారం(సెప్టెంబర్ 14,2020) నుంచే మొదలు పెట్టేశారు. నిరుద్యోగ యాత్ర చేపట్టాలని ప్లాన్ చేయడమే కాదు ఆచరణలో కూడా పెట్టేశారు. ఈ యాత్ర తాను పోటీ చేయాలనుకుంటున్న ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే సాగుతోంది.


నిరుద్యోగులను తన వైపునకు తిప్పుకుంటే వర్కవుట్‌ అవుతుందని అంచనా వేస్తున్నారట కోదండరామ్‌ సారు. మరి ఆయన ప్లాన్‌ ఎంత వరకు వర్కవుట్‌ అవుతుందో ఎన్నికలు జరిగి రిజల్ట్‌ వస్తేనే గానీ తెలియదన్న మాట.