LG POLYMERS INDIA గ్యాస్ లీక్ : విశాఖలో వెంటాడుతున్న భయం

విశాఖ దుర్ఘటన వల్ల ఎంత మంది చనిపోతారోననే ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఆ వాయువు ఏమిటి..? దాంతో మనకు ఎలాంటి ప్రాణాంతక పరిస్థితులు, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి..? స్టైరిన్ వాయువు అంటే బెంజీన్ సమ్మేళనం. ఇది ద్రవరూపంలోనూ ఉంటుంది. మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది.
ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్, రబ్బర్, లేటెక్స్ వంటి పదార్థాల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. ఈ వాయువు అత్యంత హానికరం. దీన్ని పీల్చాక 10 నిమిషాల్లోనే కొందరు స్పృహ కోల్పోయేందుకు అవకాశం ఉంటుంది. ఇక 45 నుంచి 60 నిమిషాల్లో ఆక్సిజన్ అందకపోతే కొందరు శ్వాస ఆడక చనిపోతారు. ఊపిరితిత్తులపై ఈ వాయువు ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఈ గ్యాస్‌ను పీల్చగానే ఎవరికైనా సరే శ్వాస ఆడదు. తరువాత స్పృహ కోల్పోయి.. అపస్మారక స్థితిలోకి వెళ్తారు.
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాను రాను మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. ఇది రసాయనాల ఫ్యాక్టరీ కావడంతో మంటల వల్ల వ్యాపిస్తున్న దట్టమైన పొగ విషపూరితంగా ఉందని, ఫ్యాక్టరీ చుట్టుపక్కల నివాస ప్రాంతాలను విషవాయువులు చుట్టు ముడుతున్నాయనీ అంటున్నారు. లేకేజీ ప్రభావం ఎక్కువగా ఫ్యాక్టరీ చుట్టుపక్కల నివసించే పేదలపై చూపింది. పేవ్మెంట్ల మీద నిద్రపోతున్న నిరాశ్రయులను కాటేసింది.
గతంలో భోపాల్‌లో విషవాయువు లీకై వేల మంది మరణించారు. బతికి ఉన్న వారిలో కూడా ఆ విషవాయువు ప్రభావం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. దీర్ఘకాలిక రోగాలతో బతుకును ఈడుస్తున్నారు. విషవాయువు ప్రభావానికి గురైన వారికి పుట్టిన పిల్లలలో కూడా ఆ ప్రభావం కనిపించింది. ఇప్పుడు విశాఖలో కూడా అదే జరుగుతోందా అన్న ఆందోళన వ్యక్తమౌతోంది. అంత తీవ్రంగా కాకపోయినా ప్రభావం ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.
విశాఖలో గ్యాస్ లీక్ ఘటన తెలియగానే ప్రజలకు భోపాల్ విషాదమే గుర్తుకు వచ్చింది. 36 ఏళ్ల కింద మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన దుర్ఘటనను ఈ ప్రమాదం గుర్తు చేసింది.నిపుణుల శ్రమ ఫలించింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్ గ్యాస్ అదుపులోకి వచ్చిన సంగతి తెలిసిదే. 2020, మే 07వ తేదీ గురువారం అర్ధరాత్రి నుంచి శ్రమించిన నిపుణులు ప్రత్యేక రసాయనాలతో విషవాయువును అదుపు చేశారు.
స్టైరిన్ గ్యాస్ అదుపులోకి రావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. స్టైరిన్ గ్యాస్‌ను అదుపు చేసే ముందు చుట్టుపక్క గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. మరోవైపు ట్యాంకులు బద్ధలవుతాయన్న ప్రచారం జరగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాత్రంతా నిద్రకు దూరమయ్యారు. చాలామంది ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. కేజీహెచ్‌లో 193 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 45 మంది చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులకు ఆక్సిజన్ థెరపి ద్వారా చికిత్స అందిస్తున్నారు.
విశాఖలో గ్యాస్ లీక్‌తో ఇన్ని ప్రాణాలు పోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. సాధారణంగా కంపెనీల్లో ప్రమాదం జరుగుతుందని తెలియగానే సైరన్ మోగుతుంది. ఎల్జీ పాలిమర్స్‌లో ప్రధాన అలారం మోగకపోవడం కూడా కారణంగా అధికారులు చెబుతున్నారు. గ్యాస్ లీకేజీ అయిన వెంటనే గ్యాస్ అలారం మోగింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది… ఆ లీకేజీని ఆపే ప్రయత్నాలు చేశారు. లీకైన ట్యాంకర్ నుంచి గ్యాస్‌ను మరో చోటికి తరలించే ప్రయత్నం చేశారు.
అయితే అత్యవసర సమయాల్లో వీపునకు తగిలించుకుని ఆక్సిజన్ పొందే స్కాబా సెట్లలో ఆక్సిజన్ లేనట్లు గుర్తించారు. ఇలా దాదాపు 8వరకు ఆ సెట్లు ఖాళీగా ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, హెచ్‌పీసీఎల్‌కు సమాచారం అందించి అక్కడి నుంచి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ప్రమాదం జరిగినప్పుడు చుట్టుపక్కల గ్రామస్తుల్ని అలెర్ట్ చెయ్యాల్సిన అలారం మాత్రం మోగలేదు. గ్యాస్ సైరన్ మోగిన వెంటనే.. ప్రధాన అలారం మోగించి ఉంటే.. గ్రామస్తులు తప్పించుకునేందుకు కొంత సమయం దొరికేది. కానీ, సైరన్ మోగకపోవడంతో ఘోరం జరిగిపోయింది.
Read More :