10టివి ఎఫెక్ట్ : శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో మరమ్మత్తులు

  • Published By: madhu ,Published On : November 23, 2020 / 08:08 AM IST
10టివి ఎఫెక్ట్ : శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో మరమ్మత్తులు

Updated On : November 23, 2020 / 9:19 AM IST

Repairs at Srikalahasti Mukkanti Temple : శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో లీకేజీల సమస్య సమసిపోనుంది. మరమ్మతులు చేసేందుకు తమిళనాడుకు చెందిన లక్ష్మీ మిల్స్‌ అనే సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం కోటిన్నర రూపాయలు విరాళం ప్రకటించింది. 10 టీవీ ప్రసారం చేసిన కథనాలతో లీకేజీలకు మోక్షం లభించనుండడంతో… పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో వర్షపునీటి లీకేజీ సమస్యకు త్వరలో మోక్షం లభించనుంది. ఈ సమస్యపై 10టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలతో ఆలయ అధికారుల్లో చలనం వచ్చింది. లీకేజీ సమస్యపై ఆలయ ఈవో స్పందించారు.



చెన్నై ఐఐటీ నిపుణులు : 
లీకేజీల కట్టడి కోసం చెన్నై ఐఐటీ నిపుణుల సహకారం తీసుకోనున్నట్టు వెల్లడించారు. ఐఐటీ ప్రొఫెసర్లు త్వరలో శ్రీకాళహస్తి ఆలయానికి రానున్నారని.. వారు లీకేజీలపై అధ్యయనం జరిపిన తర్వాత సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయ ఈవో పెద్దిరాజు ఈ ప్రకటన చేసిన 48 గంటల్లోనే దాతల నుంచి అద్భుత స్పందన కనిపించింది. వర్షపు నీటి లీకేజీల మరమ్మతు ఖర్చులు తామే భరిస్తామని తమిళనాడులోని కోయంబత్తూర్ కు చెందిన లక్ష్మి మిల్స్ సంస్థ ముందుకు వచ్చింది.



చెన్నై ఐఐటీ నిపుణులు : 
లీకేజీల మరమ్మతుల కోసం 70 లక్షల రూపాయలు, అలాగే ఆలయం అంతటా లైటింగ్ కోసం మరో 80 లక్షలు… మొత్తం కోటిన్నర రూపాయల విరాళాన్ని లక్ష్మీ మిల్స్ సంస్థ ప్రకటించింది. లీకేజీ లపై చెన్నై ఐఐటి ప్రొఫెసర్లు ఇక్కడ అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చిన తర్వాత 70 లక్షల రూపాయలతో మరమ్మతు పనులు చేపడతామని ఆలయ ఇంజనీర్ మురళి నాథ్ రెడ్డి 10 టీవీకి వెల్లడించారు.



చినుకు పడిందంటే :
చినుకు పడిందంటే శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయం చిత్తడిగా మారిపోతోంది. వర్షాలకు ఆలయంలో ఎక్కడ చూసినా లీకేజీలే కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శివాలయంలో సమస్య మరింత పెరిగింది. ఆలయ స్తంభాల నుంచి వర్షపు నీరు ఏకధాటిగా కిందకు జారుతోంది. ఆలయ గోడలు వర్షపు నీటితో తడిసిపోయాయి. అంతేకాదు.. గర్భాలయానికి సమీపంలో అనేక మంటపాలు తడిగా మారిపోయాయి. భక్తులు నడిచే మార్గంలోనూ వర్షపునీరు ధారలా ప్రవహిస్తోంది.



10టీవీ ప్రత్యేక కథనాలు :
ఈ వర్షపు నీటి లీకేజీలతో ఆలయ పునాదులకే ప్రమాదంగా మారింది. ఇవే అంశాలపై 10 టీవీ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. అధికారులు మేల్కొకుంటే ఆలయానికి ప్రమాదం ఎలా పొంచి ఉందో కళ్లకు కట్టింది. దీంతో స్పందించిన అధికారులు లీకేజీలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. మరమ్మతుల కోసం దాతలు ముందుకురావాలని కోరారు. ఆలయ ఈవో విజ్ఞప్తికి మేరకు… తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన లక్ష్మిమిల్స్‌ సంస్థ మరమ్మతులు చేయించడానికి ముందుకువచ్చింది. దీంతో లీకేజీ సమస్యలకు మోక్షం లభించినట్టయ్యింది. ఈ విషయంలో 10టీవీ చేసిన ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు.