నేను ఎప్పుడూ చిరంజీవికి రుణపడి ఉంటాను : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

పంచాయతీ ఫలితాలను మించి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను వైసీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

నేను ఎప్పుడూ చిరంజీవికి రుణపడి ఉంటాను : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

Updated On : March 7, 2021 / 9:12 PM IST

Minister Vellampally Srinivas Exclusive Interview : పంచాయతీ ఫలితాలను మించి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను వైసీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మిగతా పార్టీలకు నిలబడటానికి అభ్యర్థులే లేరన్నారు. ఇండిపెండెంట్లను కూడా తమ అభ్యర్థులుగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ప్యాకేజీలకు అమ్ముడు పోయేది పవన్ కళ్యాణ్..
10 టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనసేనతో కలవడంతో బీజేపీ కూడా దెబ్బతిందన్నారు. చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్నది చంద్రబాబు అని విమర్శించారు. ప్యాకేజీలకు అమ్ముడు పోయేది పవన్ కళ్యాణ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు కూడా దిక్కుమాలిన పనులు తమ నాయకుడు చేయరని పేర్కొన్నారు.

జనసేనను చంద్రబాబు ఆడిస్తున్నారు..
చంద్రబాబు, పవన్ మనుషులు వేరు…మనసులు ఒకటే అన్నారు. జనసేనను చంద్రబాబు ఆడిస్తున్నారని ఆరోపించారు. నా రాజకీయ జీవితంలో ఎక్కడా పవన్ లేరన్నారు. నాకు పవన్ తో పరిచయం తక్కువ..ఆయనతో పని లేదని చెప్పారు. నేను ఎప్పుడూ చిరంజీవికి రుణపడి ఉంటానని అన్నారు. చంద్రబాబు పరుగెత్తుకుంటూ వెళ్లినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు, లోకేశ్ మాటలకు ఎక్కడా ప్రజల్లో స్పందన లేదని వెల్లడించారు. ఐదేళ్లలో ఏం చేశారో చెప్పి ఓట్లు అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు వయసుతోపాటు చాదస్తం పెరిగిందని ఎద్దేవా చేశారు.

జగన్ చెప్పిందే చేస్తారు…చేసేదే చెబుతారు..
జగన్ కు కష్టం తెలుసు.. ప్రజలకు సాయం చేయాలనే చూస్తారని తెలిపారు. ఇచ్చిన మాట కోసం ఎంతవరకైనా వెళతారని పేర్కొన్నారు. 31 లక్షల కుటుంబాలకు ఇంటి కల నెరవేర్చిన వ్యక్తి జగన్ అని పేర్కొన్నారు. నవరత్నాలను మొదటి సంవత్సరమే అమలు చేశామని తెలిపారు. విజయవాడలో 64కు గానూ 64 డివిజన్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో జగన్ ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. అమరావతిని కూడా అభివృద్ధి చేయాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు. జగన్ చెప్పిందే చేస్తారు…చేసేదే చెబుతారని చెప్పారు.

నన్ను టార్గెట్ చేసినా నాకు భయం లేదు..
ఎవరు నన్ను టార్గెట్ చేసినా నాకు భయం లేదన్నారు. వాళ్లకున్న మరకను నాకు అంటించాలని చూస్తున్నారని చెప్పారు. నీచ రాజకీయ కుట్రలో భాగమే దేవాలయాలపై దాడులని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వమూ అశాంతి సృష్టించాలని చూడదన్నారు. కొన్ని రోజుల్లో అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు. టీడీపీ హయాంలో ఆలయాలను కూల్చినప్పుడు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఆ రోజు బీజేపీ నేతలు టీడీపీని ఎందుకు నిలదీయలేదని అడిగారు. ప్రభుత్వం 300 మందిని అరెస్టు చేసిందన్నారు.

మాకు రాజకీయ ప్రత్యర్థి లేరు..
మా ప్రభుత్వం వచ్చాక ఆలయ భూముల్లో ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాలేదన్నారు. చంద్రబాబు ధారాదత్తం చేసిన భూములను వెనక్కు తీసుకుంటున్నామని తెలిపారు. ఏపీలో వైసీపీ తప్ప మరే రాజకీయ పార్టీ మనుగడ ఉండదన్నారు. పవన్…టీఆర్ఎస్, ఎంఐఎంతో తప్ప అన్నింటితో కలిశారని ఎద్దేవా చేశారు. మాకు అసలు రాజకీయ ప్రత్యర్థి లేరని స్పష్టం చేశారు. మాకు ప్రత్యర్థులు లేరు…ప్రజలు ఆశీస్సులు చాలన్నారు.