కరోనా సోకిందేమోనన్న భయంతో పట్టించుకోని వైద్యులు…ఆస్పత్రి గేటు మందు మృతి చెందిన వ్యక్తి

కర్నూలు జిల్లా వెలుగోడు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. నాలుగు రోజులుగా ఆస్పత్రి గేటు మందు పడి ఉన్న ఓ వ్యక్తి వైద్యులు పట్టించుకోకపోవడంతో మృతి చెందారు. నాలుగు రోజులుగా స్పృహ లేకుండా పడి ఉన్నా వైద్యులు పట్టించుకోకపోవడంతో నడిరోడ్డుపైనే మృతి చెందారు. కళ్ల ముందే ప్రాణాలు పోతున్నా వైద్యులు, సిబ్బంది పట్టించుకోలేదు. కరోనా సోకిందేమోనన్న భయంతో దగ్గరకు వెళ్లేందుకు కూడా సాహసించలేదు.
చివరకు ఇవాళ అతన్ని గమనించిన స్థానికులు లేపి మంచినీళ్ల తాగించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆ అభాగ్యుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రి, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్లముందే ప్రాణాలు పోతున్నా పట్టించుకోని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సామాన్య ప్రజలు వైద్యానికి వస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు, వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతోనే ఆ వ్యక్తి మృతి చెందాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి రోజు కర్నూలు జిల్లాలో ఏదో ఒకటి జరుగుతున్నా..అధికారుల పర్యవేక్షణ లోపించిందని అర్థమవుతోంది. భవిష్యత్ లో ఇలాంటి పరిణామాలు పునరావృత్తం కాకుండా అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించకపోతే మరిన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశాలున్నాయి. ఇకనైనా వైద్యాధికార యంత్రాంగం, ఆరోగ్యశాఖ అప్రమత్తమై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. వెలుగోడు పట్టణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.