pickpocketing : చంద్రబాబు ర్యాలీలో జేబు దొంగ హల్ చల్.. పలువురి ఫోన్స్, డబ్బులు కొట్టేసిన కేటుగాడు
గమనించిన టీడీపీ కార్యకర్తలు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం కేటుగాడిని పోలీసులకు అప్పగించారు.

pickpocketing in Chandrababu rally
pickpocketing – Chandrababu Rally : టీడీపీ అధినేత చంద్రబాబు ర్యాలీలో జేబు దొంగ హల్ చల్ చేశాడు. బెంజీ సర్కిల్ దగ్గర పలువురి ఫోన్స్, డబ్బులు కొట్టేశాడు. కొట్టేసిన నగదు, ఫోన్స్ లతో పరారయ్యేందుకు యత్నించాడు. ఇది గమనించిన టీడీపీ కార్యకర్తలు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం కేటుగాడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు దొంగను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబుకి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు కోసం నిన్న (మంగళవారం) రాత్రి నుండి చంద్రబాబు నివాసం వద్ద అమరావతి రైతులు, మహిళలు ఎదురుచూశారు.
చంద్రబాబు రాజమండ్రి టు అమరావతి ప్రయాణం దాదాపు 14 గంటల పాటు సాగింది. ఇవాళ ఉదయం 6 గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. నిన్న (మంగళవారం) సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు నీరాజనాలు పలికారు.
దారి పొడవునా చంద్రబాబు కోసం ప్రజలు ఎదురుచూశారు. తెల్లవారుజామైనా, అర్ధరాత్రి అయినా చంద్రబాబు కోసం మహిళలు రోడ్లపైనే వేచి ఉన్నారు. చంద్రబాబుకు దారి పొడవునా నేతలు పూల వర్షం కురిపించారు. దారంతా టపాకాయలు కాల్చి ఘన స్వాగతం పలికారు. కోర్టు ఉత్తర్వుల మేరకు చంద్రబాబు ఎక్కడ కూడా ప్రసంగించలేదు. చంద్రబాబు కారు కూడా దిగకుండా కోర్టు ఉత్తర్వుల మేరకు కారులో నుంచే ప్రజలకు అభివాదం చేసుకుంటూ 13 గంటల పాటు ప్రయాణం చేశారు.