బాబుకు షాక్ : అక్రమాస్తుల కేసులో ఏసీబీ విచారణ

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం మరోసారి షాక్ ఇచ్చింది. 15 ఏళ్ల క్రితం ఏసీబీ కోర్టులో లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన ఫిర్యాదుపై తదుపరి విచారణ చేపట్టేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించింది. 2019, నవంబర్ 25వ తేదీ సోమవారం అక్రమాస్తుల కేసులో ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. బాబుకు ఆదాయానికి మించి ఆస్తులున్నాయని గతంలో ఏసీబీ కోర్టులో లక్ష్మీ పార్వతి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ అంశంపై 15 ఏళ్ల కిందట హైకోర్టు నుంచి బాబు స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుత స్టే గడువు ముగియడంతో ఏసీబీ రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. లక్ష్మీ పార్వతి నుంచి ఆధారాలు సేకరించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 06కు వాయిదా వేసింది కోర్టు.
> సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని లక్ష్మీ పార్వతి ఆరోపణలు.
> బాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని దీనిపై విచారించాలని 2005లో ఏసీబీకి లక్ష్మీ పార్వతి ఫిర్యాదు.
> ఏసీబీ కోర్టు విచారణ జరుపకుండా బాబు 2005, మార్చిలో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.
> అక్రమ సంపాదనతో పాటు భూములు, భవనాలు, షేర్లు కొన్నారని ఆరోపణలు.
> ఈ కేసులో ఏసీబీ కోర్టుకు హాజరవుతున్న లక్ష్మీ పార్వతి.
> స్టే ఎత్తివేయాలని లక్ష్మీ పార్వతి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.
> సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించి ఉండకూడదని సుప్రీం తీర్పు.
తాజాగా ఇచ్చిన తీర్పుతో ఏసీబీ అధికారులు విచారణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో ఆర్కే మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం. సుప్రీంకోర్టులో ఎర్లీ హియరింగ్ పిటిషన్‌ను వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే దాఖలు చేశారు. 2017లో పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టులో లిస్టింగ్ కాకపోవడంతో మరోసారి సుప్రీంను ఆశ్రయించారు. తాజాగా ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుతో టీడీపీ, బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Read More : మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు : సుప్రీం మెట్లెక్కిన ఆర్కే