అలిపిరి తిరుమల కాలిబాటకు మహర్దశ.. రూ.25కోట్ల ఖర్చుతో చివరి మెట్టు వరకూ భక్తులు తడవకుండా షెల్టర్లు

alipiri footpath: ఇప్పుడైతే కరోనా వైరస్‌కు భయపడి తిరుమల వెంకన్న దగ్గరకు వెళ్లే భక్తులు తగ్గారు. కానీ.. ఒకప్పుడు లక్షల్లో భక్తులు ఏడుకొండల వాడిని దర్శించుకునేవారు. ఇలా కాలినడకన వెళ్లే వాళ్లల్లో పేద, మధ్యతరగతి వాళ్లే కాక.. ధనవంతులు, సెలబ్రిటీలు కూడా కాలి నడకన వెళ్తూ శ్రీనివాసుని మొక్కులు తీర్చుకునేవారు. అందుకే కాలిబాట ఎప్పుడూ నిత్యం రద్దీగా ఉంటూ..గోవింద నామ స్మరణలతో మారుమ్రోగేది. అయితే కరోనా వల్ల ఇపుడు 2వేలలోపు భక్తులు మాత్రమే ఈ మార్గంలో వెళుతున్నారు.
అయితే ఎన్నాళ్ల నుంచో చిన్నచిన్న మరమ్మతులు చేపట్టాలన్న టీటీడీ ఆలోచనన ఇపుడు అమలుపరిచింది. తక్కువ భక్తులు ఉన్నప్పుడే వడివడిగా పనులు చేయడానికి శ్రీకారం చుట్టింది. దీంతో వారం రోజులుగా ఇక్కడ పనులు ఊపందుకున్నాయి. దీంతో అలిపిరి తిరుమల కాలిబాటకు మహర్ధశ పట్టనుందని భక్తులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రూ.25కోట్ల వ్యయంతో కొత్త షెల్టర్లు:
ఏడున్నర కిలోమీటర్లలో ఉన్న తిరుమల కాలిబాటను మరింత అభివృద్ధి చేయడానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 25 కోట్ల రూపాయల ఖర్చుతో.. పాడైపోయిన షెల్టర్లను తొలగించి వాటి స్థానంలో కొత్త షెల్టర్లను ఏర్పాటు చేయనున్నారు. నడకదారిలో భక్తులకు అవసరమైన విశ్రాంతి సముదాయాలు, టాయిలెట్స్, తాగునీటి జలప్రసాద కేంద్రాలను అవసరమైన దగ్గర ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడున్న షెల్టర్లను టీటీడీ పిల్లర్లతో సహా తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించనుంది. ప్రస్తుతం నడకదారిలో భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో మరమ్మతు పనుల వల్ల భక్తులకు ఇబ్బంది ఉండదని టీటీడీ భావిస్తోంది.
6 నెలల్లో కాలిబాట మరమ్మత్తు పనులు పూర్తి:
భక్తుల రాక అధికమయ్యేలోపు అంటే మరో 6 నెలల్లో కాలిబాట మరమ్మతు పనులను పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది. కాలిబాటలో మరమ్మతులు చేయాలని నిర్ణయం తీసుకున్న టీటీడీ వెంటనే మరమ్మతు పనులను ప్రారంభించింది. ఆ ప్రాంతంలో ప్రస్తుతం నడిచి వెళ్లే భక్తులను కొద్దిదూరం రోడ్డు మీద వెళ్లేలా దారి మళ్లించారు.
కాలినడకన దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం:
కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పిలుచుకుంటారు. ఆ దేవదేవుని దగ్గరికి కాలినడకన వెళ్లి దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే నడకదారిని ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. భక్తులు నడిచి వెళ్లే దారిలో ఎండకు, వర్షానికి రక్షణ ఇచ్చేలా మూడు దశాబ్ధాల క్రితం టీటీడీ షెల్టర్లను ఏర్పాటు చేసింది. ఈ షెల్టర్లు పాతబడడంతో వర్షం వస్తే భక్తులు తడిచే అవకాశం ఉండటంతో.. టీటీడీ కాలిబాటను మరమ్మత్తులు చేయాలని నిర్ణయం తీసుకుంది.
3వేల 550 మెట్లు, 7.5 కిమీ:
అలిపిరి నుంచి తిరుమల వరకు మొత్తం 3వేల550 మెట్లు ఉంటాయి 7.5 కిలోమీటర్ల దూరమున్న నడక దారిలో చివరి మెట్టు వరకు కూడా భక్తులు తడవకుండా షెల్టర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నడకదారిపై భక్తుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు లేకపోయినా అక్కడక్కడా బాగా పాడవడం, వర్షం వస్తే భక్తులు తడిచే అవకాశం ఉండటంతో.. నడకదారిని అభివృద్ధి చేయాలని టీటీడీ మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టింది. మొత్తం మీద మరో ఆరు నెలల్లో భక్తులకు అధునాతన సౌకర్యాలతో కూడిన నడకదారి అందుబాటులోకి రానుంది.