అమలాపురంలో పట్టపగలే కత్తులతో దాడి

అమలాపురంలో సోమవారం (సెప్టెంబర్ 30, 2019)న పట్టపగలు రౌడీలు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా మారణాయుధాలతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అందరూ చూస్తున్నారే కానీ..దాడి చేస్తున్న వ్యక్తులను ఆపలేకపోయారు.
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని సావరంకు చెందిన విపర్తి రవి కుమార్ (24) ఈదరపల్లి వంతెన నుంచి వెళుతున్నాడు. ఉన్నట్టుండి ఓ వ్యక్తి ముందుగా వచ్చి కత్తితో కడుపులో పొడిచాడు. రవి కుమార్ తేరుకొనేలోపే మిగతా వ్యక్తులు వచ్చి ఇష్టానుసారంగా కత్తులతో దాడికి దిగారు.
ప్రాణాలు రక్షించుకొనేందుకు పరుగులు తీసినా..దుండగులు వెంటాడారు. చివరకు దాడిలో తీవ్రంగా గాయపడిన రవి కుమార్..కుప్పకూలిపోయాడు. దాడి చేసిన వారు పారిపోయారు. దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గాయపడిన ఇతడిని అమలాపురంలోని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రవికుమార్ సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. దువ్వా వెంకన్న, షేక్ యోహాన్, సాయి, లక్ష్మణ్, చందులు అతనిపై దాడి చేశారని బాధితుడు చెబుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.