Ambati Rambabu: సత్తెనపల్లిలో అంబటి సైలెంట్‌ మోడ్.. గుంటూరు ఈస్ట్‌ వైపు అడుగులు

గుంటూరు ఈస్ట్‌ను అంబటి కోసమే ఉంచారని పార్టీల్లో చర్చ జరుగుతోంది.

Ambati Rambabu: సత్తెనపల్లిలో అంబటి సైలెంట్‌ మోడ్.. గుంటూరు ఈస్ట్‌ వైపు అడుగులు

Updated On : December 9, 2024 / 8:48 PM IST

ఆయన ఓ ఫైర్ బ్రాండ్.. వ్యంగాస్త్రాలను వదలడంలో తనకు తానే సాటి. తనదైన బాడీ లాంగ్వేజ్‌తో తన మాటకారితనంతో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకోవడంలో దిట్ట. ఆ దూకుడే ఆయన్ను మంత్రి పదవిలో కూర్చోబెట్టింది.. ఆ స్పీడే జగన్‌కు వీర విధేయుడిని చేసింది. ఈ రేంజ్ టాలెంట్ వైసీపీలో ఒక్క అంబటి రాంబాబుకే సొంతం. అంబటి అంటేనే ఏపీ పాలిటిక్స్‌లో హాట్ కామెంట్స్‌కి పెట్టింది పేరు.

ఎప్పుడో మూడున్నర దశాబ్దల ముందు రాజకీయ అరంగేట్రం చేసిన అంబటి.. 2022లో మంత్రి కాగలిగారు. ఇక ఆయన అనేక ఎన్నికల్లో పోటీ చేసినా రెండు సార్లు మాత్రమే గెలిచారు. అయితే అంబటిని రాజకీయంగా ఇప్పటిదాకా నిలబెట్టినవి ఆయన నోటి ధాటి, వెనక బలమైన సామాజిక వర్గం. దాంతో పాటు విధేయత. YSR కుటుంబాన్ని నమ్ముకుని రాజకీయం చేస్తూ వచ్చిన ఆయన జగన్‌కు వెన్ను దన్నుగా ఉంటూ వస్తున్నారు. జగన్ సైతం ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు.

అంబటి రాంబాబును సత్తెనపల్లి ప్రజలు రెండు సార్లు ఓడించి ఒక్కసారి గెలిపించారు. 2014 ఎన్నికల్లో అంబటి ఓటమి చవి చూశారు. ఆ తర్వాత వచ్చిన 2019 ఎన్నికల్లో గెలిపించారు. ఇక మొన్నటి 2024 ఎన్నికల్లో అంబటిని సత్తెనపల్లి ప్రజలు మళ్లీ ఓడించారు. ఇక అప్పటి నుంచి అంబటి రాంబాబు సత్తెనపల్లిలో సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. నియోజకవర్గాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. వినిపించడం లేదు. దీంతో ఆయన నియోజకవర్గం నుంచి షిఫ్ట్ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి 2024లోనే సత్తెనపల్లి స్థానం మారుస్తారని ఎన్నికల ముందు తెగ ప్రచారం జరిగింది. కానీ చివరిలో సత్తెనపల్లి టికెట్‌ను అంబటి వద్దే అంటిపెట్టి ఉంచింది అధిష్టానం.

గత ఎన్నికల్లో అంబటికి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడి బాధ్యతలను అంబటి రాంబాబుకు అప్పగించారు. ఆయన సేవలను కేవలం ఒక జిల్లాకు ఎందుకు పరిమితం చేశారని అప్పట్లో వైసీపీ లోపలా బయటా హాట్ డిస్కషన్ సాగింది. అయితే కోస్తాలో బలమైన ఒక సామాజిక వర్గంతో ఆయనకు ఉన్న బంధాలు అందరినీ కలుపుకుని పోయే పెద్దరికం ఉండడం వల్లనే ఆయనకు ఏరి కోరి తెచ్చి ఆ పదవిలో పెట్టిందని కొందరు పార్టీ పెద్దలు చెప్పుకువచ్చారు.

పార్టీ కార్యక్రమాల్లో మాత్రం ఫుల్ బిజీ
ఇక అప్పటి నుంచి గుంటూరు జిల్లా వైసీపీ బాధ్యతలను చూస్తున్నారు అంబటి. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత సత్తెనపల్లి వైపు అంబటి కన్నెత్తి కూడా చూడదటం లేదు. గుంటూరు జిల్లా పార్టీ కార్యక్రమాల్లో మాత్రం ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇటు వైసీపీ అధిష్టానం కూడా సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలను వేరేవాళ్ల చేతిలోపెట్టాలని చూస్తోంది.

దీంతో అంబటి నియెజకవర్గ మార్పు ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. అంబటిని రేపల్లె లేదా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా ప్రకటనవచ్చే అవకాశముందని తెలుస్తోంది. గతంలో రేపల్లె ప్రజలు ఒకసారి గెలిపించి అసెంబ్లీకి పంపించారు. అంతేకాకుండా అంబటి స్వస్థలం రేపల్లె కావడంతో ఆయన సత్తెనపల్లి నుంచి రేపల్లెకి వెళ్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే రేపల్లెలో సోదరుడు అంబటి మురళి కూడా ఉన్నారు.

మరోవైపు గుంటూరు ఈస్ట్‌పై అంబటి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. దీంతో గుంటూరు ఈస్ట్‌కే మార్చుతారని టాక్‌ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం గుంటూరు ఈస్ట్ ఇన్‌చార్జ్‌ పోస్ట్‌ ఖాళీగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన విడదల రజిని తిరిగి తన పాత నియోజకవర్గం చిలకలూరిపేటకు వెళ్లిపోయారు.

దీంతో గుంటూరు ఈస్ట్‌ను అంబటి కోసమే ఉంచారని పార్టీల్లో చర్చ జరుగుతోంది. అయితే స్థానిక ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈస్ట్ నుంచి ఉన్నారు. దీంతో ఈ ఇద్దరి మధ్య కోల్డ్‌ వార్ నడుస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంబటి రాంబాబును రేపల్లెకు పంపిస్తారా.. లేదంటే.. గుంటూరు ఈస్ట్‌లోనే సీట్ ఫిక్స్ చేస్తారా అన్నది వేచి చూడాలి.

విశాఖ డెయిరీ అవినీతి మరకల్లో నిజమెంత? పాల నురగలకు రాజకీయ రంగులు అంటుకున్నాయా?