విశాఖ డెయిరీ అవినీతి మరకల్లో నిజమెంత? పాల నురగలకు రాజకీయ రంగులు అంటుకున్నాయా?

స్థానిక ఎమ్మెల్సీని కమిటీలో సభ్యుడిగా తీసుకోవాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది.

విశాఖ డెయిరీ అవినీతి మరకల్లో నిజమెంత? పాల నురగలకు రాజకీయ రంగులు అంటుకున్నాయా?

Updated On : December 9, 2024 / 8:47 PM IST

నాలుగు దశాబ్దాల చరిత్ర.. ఎందరో కార్మికులకు ఆపన్నహస్తం.. ఎందరో రైతులకు అభయహస్తం విశాఖ డెయిరీ. నాణ్యత, నవ్యత, నమ్మకం ఇవే ఈ సంస్థకు పెట్టుబడులు. అలాంటి చరిత్ర కలిగిన విశాఖ డెయిరీ వెనుక అవినీతి నురగలు దాగి ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎక్కడ చూసినా అవకతవకలు.. ఏ రికార్డ్‌ తెరిచినా.. తప్పుల తడక అంటూ విమర్శలు గుప్తిస్తున్నారు. స్వచ్ఛమైన పాల మాటున జరిగే అవినీతి బాగోతాన్ని బయటపెట్టేందుకు సర్కార్ సన్నద్ధమైంది.

ఉమ్మడి విశాఖ జిల్లాలో దివంగత ఆడారి తులసీదాస్ 1986 ఆగస్టు 29న ఓ మామాలు పాల డెయిరీని స్థాపించారు. రైతుల చెమటచుక్కలు.. ఆయన తెలివి తేటలు ఆ సంస్థను భారీ సంస్థగా తీర్చిదిద్దాయి. ఆడారి తులసీదాస్ ఏకధాటిగా 37 ఏళ్ళ పాటు విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఉండి పాడి రైతుల అభ్యన్నతి కోసం అహర్నిశలూ కృషి చేశారు. ఆయన టీడీపీకి బలమైన మద్దతుదారుడిగా ఉండేవారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూనే టీడీపీని విశాఖ జిల్లాలో బలోపేతం చేస్తూ వచ్చారు.

తులసీదాస్ అనంతరం ఆయన కుమారుడు ఆడారి ఆనంద్ కుమార్ డెయిరీ చైర్మన్ అయ్యారు. ఈయన మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.. 2019లో టీడీపీ తరఫున అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకొని.. 2024లో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఐనా ఓటమి తప్పలేదు. ఆనంద్‌కుమార్ మళ్లీ టీడీపీలోకి తిరిగి వస్తారని ప్రచారం సాగుతున్న వేళ విశాఖ డెయిరీలో అవినీతి ప్రకంపనలు మొదలయ్యాయి.

విశాఖ డెయిరీ చుట్టూ బాగోతాలు
విశాఖ డెయిరీ చుట్టూ జరుగుతున్న బాగోతాన్ని కూటమి నేతలు ఒక్కొక్కటి బయటపెట్టడం మొదలుపెట్టారు. కంపెనీ చట్టం ప్రకారం డెయిరీ ఛైర్మన్, డైరెక్టర్లు ఇదే తరహా మరో వ్యాపారం చేయకూడదు. ఛైర్మన్‌ ఆనంద్‌ మాత్రం హైదరాబాద్‌లో విశాఖ మిల్క్‌ ప్రొడక్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఓ డెయిరీ నిర్వహిస్తున్నారు.

దీనికి విశాఖ డెయిరీకి చెందిన రంగంపేట నుంచి రోజూ 15 వేల లీటర్ల పాలు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రైతుల కోసం ఏర్పాటు చేసిన డెయిరీ ఆసుపత్రిని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి లీజుకిచ్చేశారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆడారి ఆనంద్‌ తన రాజకీయ కార్యక్రమాలతోపాటు, ఆ పార్టీ సిద్ధం సభలకు కూడా డెయిరీ నిధులను వాడారన్న అభియోగాలున్నాయి.

ఇవే కాకుండా డెయిరీ ఉద్యోగులకు ఇళ్లు కట్టిస్తామని మరో మోసానికి తెరలేపారని కూటమి నేతలు అంటున్నారు. ఒక్కో ఉద్యోగి నుంచి నుంచి 86 వేలు వసూలు చేసి, వాటితో నరవ వద్ద 3 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో 90 సెంట్ల భూమిని ఆడారి కుటుంబసభ్యులు ఉచితంగా రాయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన భూమిని ఓ వైసీపీ నేతకు డెవలప్‌మెంట్‌ పేరుతో అప్పగించి.. అందులో కొన్ని ప్లాట్లను ఆడారి బంధుగణానికి కట్టబెట్టారనే ప్రచారం కూడా ఉంది.

పాడిరైతుల శిక్షణ, ఇతర అవసరాల కోసం భూములు కేటాయించింది ప్రభుత్వం. 2006లో విశాఖ డెయిరీని కంపెనీ చట్టంలోకి మార్చుకున్నారు. ఇలా మారిన తర్వాత ఆ భూములను వెనక్కి ఇచ్చేయాలి. విశాఖ నగరంతో పాటు నర్సీపట్నం, అరకు, పాడేరు, చింతపల్లిలో 34 ఎకరాలకు పైగా భూములు ఇంకా డెయిరీ చేతిలోనే ఉన్నాయి. చినగదిలి సర్వే నెంబరు 13, 21, 26లో కేటాయించిన 20 ఎకరాల్లో 7.95 ఎకరాల స్థలం మిగిలి ఉంది. ఇందులో భవన నిర్మాణాలు కూడా చేపట్టారు. బహిరంగ మార్కెట్‌లో 500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, వ్యాపారం చేస్తున్నారంటూ ఇటీవల జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ప్రభుత్వానికి లేఖ రాయడంతో భీమిలి ఆర్డీవో విచారణ చేపట్టారు.

రూ.కోట్లు పక్కదారి?
లక్షల మంది పాడి రైతుల కాయకష్టంతో నిర్మించిన డెయిరీలో రూ.కోట్లు పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. 2వేల కోట్ల టర్నోవర్‌తో ఉన్న డెయిరీ ఇప్పుడు అప్పులు తీసుకునే పరిస్థితికి దిగజారింది. విశాఖ డెయిరీ పాలనురగకు రాజకీయ రంగులు అంటుకోవడంతో డెయిరీ లక్ష్యాలు మారిపోయాయి. సహకార రంగంలో ఉండే విశాఖ డెయిరీ కంపెనీ చట్టంలోకి మారిన తర్వాత పాడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఆవు పాల ధరను లీటర్‌కు 3 రూపాయాల వరకు తగ్గించడంతో రైతులు ఆందోళనబాట పట్టారు. ఇటు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదంటూ ఉద్యోగులు సైతం గళం విప్పుతున్నారు.

విశాఖ డెయిరీ అవినీతి నీడలు.. అసెంబ్లీ వేదికగా చర్చకు వచ్చాయి. అవినీతి, అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఏపీ అసెంబ్లీ.. సభా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చైర్మన్‌గా, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్‌వీఎస్‌కేకే రంగారావు, దాట్ల సుబ్బరాజును సభ్యులుగా నియమించింది. విచారణకు ఈ సంఘానికి పూర్తిస్థాయి అధికారాలు అప్పగించింది. అవసరమైతే నిపుణులను నియమించుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

అయితే స్థానిక ఎమ్మెల్సీని కమిటీలో సభ్యుడిగా తీసుకోవాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది. మొత్తానికి నిజాల్ని నిగ్గుతేల్చేందుకు ఈ సభా సంఘం రంగంలోకి దిగింది. విశాఖ డెయిరీ హౌస్ కమిటీ ఛైర్మన్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో డెయిరీని పరిశీలించారు. హౌస్ కమిటీ వచ్చిన వేళ చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. పూర్తిగా అధ్యయనం చేసి అసెంబ్లీకి నివేదిక ఇస్తామని హౌస్ కమిటీ చెబుతోంది. మరి ఈ హౌస్ కమిటీ విచారణలో నిగ్గు తేలే నిజాలేంటి..? బయటపడే మోసాలేంటి..? వేచి చూడాల్సిందే.

Sanjay Malhotra: ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా.. ఆయన గురించి తెలుసా?