Ambula Vaishnavi : అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా అంబుల వైష్ణవి.. రూ.50 లక్షల విరాళం.. ఎవరీ వైష్ణవి?
రాష్ట్ర అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Ambula Vaishnavi : ఏపీ రాజధాని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవిని నియమిస్తూ సీఆర్డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా నియామకమైన వైష్ణవి.. సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. తనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
అమరావతి అభివృద్ధి తన కల అని, రాజధాని నిర్మాణానికి కావాల్సిన మద్దతును కూడగట్టేందుకు తన వంతు కృషి చేస్తానని వైష్ణవి తెలిపారు. కాగా, చిన్న వయసులోనే సామాజిక బాధ్యతను స్వీకరించి అమరావతి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నందుకు వైష్ణవిని ప్రత్యేకంగా అభినందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వైష్ణవి సేవాభావం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
Also Read : ఏపీ ప్రజలకు కొత్త పథకం.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా.. ఎప్పటినుంచంటే?
రాజధాని నిర్మాణం తదితర అంశాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకు, యువతకు వివరించాలని వైష్ణవికి సూచించారు సీఎం చంద్రబాబు. కాగా, గతంలోనే రాజధాని నిర్మాణం కోసం 50 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు అంబుల వైష్ణవి. చిన్న వయసులోనే రాజధాని అభివృద్ధికి కృషి చేయడంతో పాటు అమరావతి నిర్మాణానికి నిధుల సమీకరణలో కీలక పాత్ర పోషించారు.
రాష్ట్ర అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అంబుల వైష్ణవి లాంటి యువతీ యువకులు తమ సామాజిక బాధ్యతను గుర్తించి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాజధాని ప్రాధాన్యతను ప్రజలకు వివరించడంలో, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కృషి చేయాలని వైష్ణవికి సూచించారు సీఎం చంద్రబాబు. రాజధాని నిర్మాణం కోసం చేపడుతున్న చర్యలపై విస్తృతంగా ప్రచారం చేసి అందరి మద్దతు పొందేలా పని చేయాలన్నారు.
కాగా, అంబుల వైష్ణవి గతేడాది జూన్‌లో రాజధాని అమరావతి 25 లక్షల రూపాయలు, 2019కి ముందు పలు సార్లు కలిపి 25 లక్షల రూపాయలను విరాళంగా అందించారు.