తెలంగాణాను కరెంటు అప్పు అడిగిన ఏపీ

అనూహ్యంగా ఏర్పడుతున్న కరెంటు కోతలతో ఆంధ్రప్రదేశ్‌లో అలజడి మొదలైంది. దీనికి కారణం మహానది బొగ్గు గనులు, సింగరేణి కొలరీల్లో వనరుల కొరతేనని స్పష్టమైంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పవర్ కట్‌లు సంభవిస్తున్నాయి. కరెంటు ఉత్పత్తి చేస్తున్న యూనిట్లలో సడెన్ ట్రిప్‌లు రోజుకు 5నుంచి 6గంటల విద్యుత్ సరఫరా నిలిచిపోయేలా చేస్తున్నాయి.
ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను సాయం అడగనున్నారు. సింగరేణి బొగ్గు గనుల నుంచి ఎక్కువ మొత్తంలో బొగ్గు కావాలనేదే ఏపీ విజ్ఞప్తి. ఈ మేరకు శక్తి వనరుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలా స్పందించారు.
‘ఏపీకి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలంటే 70వేల మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు కావాలి. కానీ, మనకు 45వేల మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే వస్తుంది’ అని మంత్రి తెలిపారు. మహానది బొగ్గుగనుల్లో జరిగిన ప్రమాదం కారణంగా 15రోజుల పాటు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రానున్నాయి. దాంతో పాటు సింగరేణి కార్మికులు సైతం సమ్మెను నిర్వహిస్తుండటం ఏపీ ట్రాన్స్ కోకు తలనొప్పి తెచ్చి పెట్టింది.