Srisailam temple : శ్రీశైలం అన్నదాన భవన్‌లో పేలిన బాయిలర్ .. పేలుడు ధాటికి ఎగిరిపడ్డ సామగ్రి .. హడలిపోయిన సిబ్బంది..
శ్రీశైలం దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్‌లో పెను ప్రమాదం జరిగింది. శ్రీశైలంలోని అన్నదాన భవనంలో ఓ బాయిలర్ పేలింది.

steam water boiler blast in srisailam temple annapurna
steam water boiler blast in srisailam temple : కార్తీక మాసం కావటంతో పరమశివుడు కొలువైన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈక్రమంలో శ్రీశైలం దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్‌లో పెను ప్రమాదం జరిగింది. శ్రీశైలంలోని అన్నదాన భవనంలో ఓ బాయిలర్ పేలింది. ఈప్రమాదం జరిగిన సమయంలో సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరుగకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
భక్తులకు భోజనం, అల్పాహారం తయారీకి వినియోగించే వంటగది (అన్నపూర్ణ భవనం)లో బాయిలర్ పేలింది. పేలుడు ధాటికి బాయిలర్‌లోని ఎస్‌ఎస్ ట్యాంక్, అక్కడ ఉన్న సామగ్రి ఎగిరిపడ్డాయి. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన తరువాత ఆలయ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. బాయిలర్ పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
కర్నూలు జిల్లా శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కార్తీక మాసం తొలి సోమవారం (అక్టోబర్ 31,2022) కావడంతో వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి భక్తులు భఆరీగా తరలివచ్చారు. దీంతో ఆలయంలోని కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు నిండిపోయాయి. వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగాధర మండపం, ఆలయ మాడ వీధుల్లో దీపారాధన నిర్వహిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో శ్రీగిరి పురవీధుల్లో సందడి వాతావరణ నెలకొంది.
ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లలో భక్తులకు వేడిపాలు, అల్పాహార ప్రసాదాలను పంపిణీ చేస్తోంది. ఈక్రమంలో భక్తులకు అన్నప్రసాదాలు వండే అన్నపూర్ణ భవనంలో బాయిలర్ పేలి హడలెత్తించింది. కానీ సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరుగకపోవటం శుభపరిణామంగా భావిస్తున్నారు అధికారులు.