Andhra techie Prashanth: మతం మారమని అడిగారు.. పాకిస్తానీలు మానవత్వం చూపారు -ప్రశాంత్
ఆన్‌లైన్‌లో ప్రేమించిన యువతికోసం వెళ్లి దురదృష్టవశాత్తు పాకిస్తాన్ భూభాగంలోకి అడుగుపెట్టి, అక్కడే అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపి ఎట్టకేలకు ఇండియాకు వచ్చిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రశాంత్ విశాఖకు చేరుకున్నారు.

Andhra Techie Prashanth
Andhra techie: ఆన్‌లైన్‌లో ప్రేమించిన యువతికోసం వెళ్లి దురదృష్టవశాత్తు పాకిస్తాన్ భూభాగంలోకి అడుగుపెట్టి, అక్కడే అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపి ఎట్టకేలకు ఇండియాకు వచ్చిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రశాంత్.. విశాఖకు చేరుకున్నారు. ఈ సంధర్భంగా ప్రశాంత్ తండ్రి మాట్లాడుతూ.. మా అబ్బాయి ఈరోజు క్షేమంగా ఇంటికి రావడానికి భారత ప్రభుత్వం చాలా సహాయం చేసిందని, మా అబ్బాయి వస్తాడో? రాడో? తెలియక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లే ఈరోజు మా అబ్బాయిని చూడగలిగామన్నారు. మా అపార్ట్‌మెంట్ వాసులంతా మా అబ్బాయిని తిరిగి రప్పించే ప్రయత్నానికి చాలా సహాయం చేశారని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ నుంచి మా అబ్బాయి రాలేడని మేము ఆశ వదిలేసుకున్నాము. కానీ ప్రయత్నం మాత్రం ఆపలేదన్నారు. తెలంగాణ ఏపీ ప్రభుత్వాలతో పాటు సహయత అనే స్వచ్ఛంద సంస్థ ఎంతో సహయం అందించినట్లుగా చెప్పుకొచ్చారు.
ప్రశాంత్ మాట్లాడుతూ.. “నేను మళ్ళీ మా అమ్మ, నాన్నలను కలుస్తానని అస్సలు అనుకోలేదు. భారత ప్రభుత్వం సహాయం చేయబట్టే నేను ఇంటికి చేరుకోగలిగాను. నాలాగే పాకిస్తాన్ వెళ్లి అక్కడ చిక్కుకుని ఇబ్బంది పడుతున్నవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అక్కడ ఇరుక్కున్న భారతీయుల పేర్లను నేను ప్రభుత్వానికి ఇచ్చాను. కేంద్రప్రభుత్వం పాకిస్థాన్‌లో నాలాగా ఇరుక్కున్న మిగతావారిని కూడా భారత్‌కి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ప్రశాంత్.
కొంతమంది శిక్ష పూర్తయినా కూడా.. ఎంబసీలో క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నారు. ఇండియా, పాకిస్తాన్ బోర్డర్‌లో నన్ను ఎవరూ పట్టుకోలేదు. పాకిస్తాన్ బోర్డర్ దాటి నడుచుకుంటూ వెళ్తుంటే హైవే ప్యాట్రోల్ వాళ్ళు రెండోవ రోజు నన్ను పట్టుకున్నారు. పాకిస్తాన్‌లోకి ప్రవేశించిన తర్వాత 40కిలోమీటర్లు నడిచాను. పాకిస్తాన్ భద్రత సిబ్బంది మానవత్వం చుపారు. భారత ఖైదీలతో జైలులో పని చేపించరు. పాకిస్థాన్‌లో ఉన్న ఖైదీలను ముస్లింలుగా మారమని అడుగుతారు.
జైలులో ఉన్నప్పుడు నన్ను కూడా మారమని అడిగారు.. నేను మారనని, శివుణ్ణి ప్రార్థిస్తానని చెప్పాను. ఇంతకుముందులాగే నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడుతాను.” అని చెప్పుకొచ్చారు.