ఏపీకి బిగ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు
ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది

Rain
AP Rains: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాబోయే ఐదు రోజులపాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పిడుగులతో కూడిన వర్షాలతోపాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
రుతు పవన గాలులు కొనసాగనున్నాయని.. 40-50 కిమీ వేగంతో గాలుల వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని సూచించింది.
ఇవాళ (శనివారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రేపు (ఆదివారం) ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని సూచించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.