Rain Alert For AP : మరో అల్పపీడనం.. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు..! ఎన్ని రోజులు అంటే..

వర్షాల కారణంగా వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అధికారులు సూచించారు.

Rain Alert For AP : మరో అల్పపీడనం.. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు..! ఎన్ని రోజులు అంటే..

Ap Rain Alert (Photo Credit : Google)

Updated On : November 10, 2024 / 6:27 PM IST

Rain Alert For AP : నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత రెండు రోజుల్లో అల్పపీడనం పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు నెమ్మదిగా కదులుతుందని వెల్లడించింది.

నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందన్నారు. వర్షాల కారణంగా వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అధికారులు సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

అల్పపీడనం ప్రభావంతో 4 రోజుల పాటు ఏపీ, తమిళనాడు, కేరళలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 24 గంటలుగా తమిళనాడు, కేరళలో భారీ వానలు పడతాయని పేర్కొంది. ఇవాళ్టి నుంచి తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ నెల 12, 13న కోస్తాంధ్ర, యానం, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఈ నెల 12 నుంచి 15వ తేదీల మధ్య తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలతో పాటు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది.

 

Also Read : నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నదెవరు? ఎమ్మెల్సీ కోసమే పట్టుబడుతున్న లీడర్లు ఎవరు?