Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం..
మరో మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశంఉంది.

Rain
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధ, గురు వారాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అనే జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భాగ్యనగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా 8 సెంటీ మీటర్ల మేర కుండపోతగా వర్షం కురిసింది. దీంతో రహదారులపై వర్షపునీరు నిలిచి వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Hyderabad Rain : హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. ఉరుములు, ఈదురుగాలులతో కుమ్మేసిన వాన
మరో రెండు రోజులపాటు హైదరాబాద్‌లో వాతావరణం ఇలానే ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లోకూడా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పంటలు చేతికొచ్చే సమయం కావడంతో ఈ అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల్లో పంటనష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం.. ఈదురుగాలులతోపాటు వడగళ్లవాన
ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, కోస్తాల్లో మంగళవారం అక్కడక్కడా మోస్తరు వానలు పడ్డాయి. అయితే మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అనంతపురం, నంద్యాల, కర్నూల్, ప్రకాశం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లోనూ ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఉరుములు, మెరుపులతో పాటు వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద ఉండొద్దని అధికారులు సూచించారు.
బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాతో పాటు యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. బుధ, గురు వారాల్లో పలుజిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
రాయలసీమలో ముఖ్యంగా అనంతరం,నంద్యాల, కర్నూలు,ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపుల వర్షంతో కూడి "పిడుగులు" పడే అవకాశం ఉంది. ఎక్కడైనా ఎపుడైనా ఉరుములు మెరుపులతో వర్షం ఉన్నప్పుడు చెట్ల కింద ఉండరాదు.రైతులు,కూలీలు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలి.
-బిఆర్ అంబేద్కర్,ఎండి,APSDMA pic.twitter.com/6JNdl3fCPk— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) April 25, 2023