AP Budget : ఇవాళ్టి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ఆ హామీల అమలుకు బడ్జెట్ లో పెద్దపీట వేస్తారా?

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

AP Budget : ఇవాళ్టి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ఆ హామీల అమలుకు బడ్జెట్ లో పెద్దపీట వేస్తారా?

AP Assembly

Updated On : November 11, 2024 / 7:33 AM IST

AP Assembly Budget Session 2024: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దాదాపు రూ. 2.90 లక్షల కోట్లతో 2024 – 25 వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఎన్నికల హామీల్లో భాగమైన సూపర్ -6 పథకాల అమలుకు వార్షిక బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అభివృద్ధి – సంక్షేమం సమతూకంగా బడ్జెట్ రూపకల్పన చేయనున్నారు. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా.. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 9.20 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అనంతరం బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన తరువాత అసెంబ్లీ వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. 22వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

Also Read: రూ.15వేల కోట్ల రుణం.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు..

ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆర్థిక మంత్రితో పాటు ఉన్నతాధికారులకు బడ్జెట్ పై దిశానిర్దేశం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అధ్యయనానికే నాలుగు నెలల సమయం పట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేసింది. అప్పటికి కూడా రాష్ట్రంలో పూర్తి స్థాయి అప్పుల లెక్కలు, పెండింగ్ బిల్లుల లెక్కలు తేలలేదు. ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఇంత సమయం పట్టింది.

సాధారణంగా ఏటా మార్చిలోపు బడ్జెట్ ను చట్టసభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతారు. ఎన్నికల సమయంలో కావడంతో గత వైసీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను సమర్పించింది. జూన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జూలైలో ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉన్నా.. ఆర్థిక పరిస్థితులపై అవగాహన, పూర్తి సమాచారంకోసం వాయిదా వేసింది. మరో నాలుగు నెలల కాలానికి తాత్కాలికంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేయించారు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులు, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి లక్ష 29 వేల 772.97 కోట్ల రూపాయలకు అనుమతులు తీసుకున్నారు.

ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నా.. నాలుగు నెలలే మిగిలి ఉంది. ఈ వ్యవధిలో ఎంత ఖర్చు చేయాలి అనే అంచనాల మేరకు పూర్తి స్థాయి బడ్జెట్ ను రూపొందించింది ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాల అమలు ప్రారంభించింది కూటమి సర్కార్. సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎలా ఉండాలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని కలిపి కోరుకుంటున్నారని.. అందుకు అనుగుణంగానే బడ్జెట్ ఉండాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రెండు మూడు నెలలకో పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం.. చివరి నాలుగు నెలల్లోనూ ఆ దిశగానే అడుగులు వేయబోతోంది.