ప్రధాని ముందుకు తిరుమల లడ్డూ వివాదం..! కీలక అంశాలపై మోదీతో సీఎం చంద్రబాబు చర్చ..
వరద సాయానికి సంబంధించిన నిధులను పెంచాలని కేంద్రాన్ని కోరారు చంద్రబాబు.

Cm Chandrababu Meets Pm Modi (Photo Credit : Google)
Cm Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అమరావతికి వరల్డ్ బ్యాంకు నిధులు, పోలవరం తొలి దశ నిధులు, విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం, వైజాగ్ రైల్వే జోన్ తో పాటు వరద సాయం తదితర అంశాలపై మోదీతో చర్చిస్తున్నారు. అలాగే, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపైన పూర్తి ఆధారాలను ప్రధానికి సమర్పించనున్నారు చంద్రబాబు.
మరిన్ని నిధులు ఇవ్వాలని విన్నపం..
ఏపీ పరిస్థితులకు సంబంధించి చంద్రబాబు ప్రధానితో డిస్కస్ చేస్తున్నారు. వంద రోజుల కూటమి ప్రభుత్వం పాలన, ఏపీలో ఎన్డీయే సర్కార్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు.. వీటన్నింటికి సంబంధించిన అంశాలను ప్రధాని దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో విజయవాడకు తీరని నష్టం జరిగింది. ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం వాటాగా.. కేంద్ర హోంశాఖ విడుదల చేయడం జరిగింది. ఇంకా అపార నష్టం జరిగింది, రైతులు పంటలు నష్టపోయారు, అలాగే పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతులు పూర్తిగా దెబ్బతిన్నాయి కాబట్టి కేంద్రం మరింత ఆర్థిక సాయం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ప్రపంచ బ్యాంకు నుంచి రుణసాయం వచ్చేలా చూడాలని విజ్ఞప్తి..
వరద సాయానికి సంబంధించిన నిధులను పెంచాలని కేంద్రాన్ని కోరారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్ట్ తొలి విడతకు సంబంధించిన నిధులను కూడా త్వరితగతిన విడుదల చేయాలని ప్రధాని దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లనున్నారు. అలాగే, అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి రుణ సాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రధాని మోదీని చంద్రబాబు కోరబోతున్నారని సమాచారం.
లడ్డూ వివాదంపై ప్రధానికి ఆధారాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు..!
ఇక ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన అంశం లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం. ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది. లడ్డూ కల్తీ వివాదంపై స్వతంత్ర దర్యాఫ్తునకు సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. లడ్డూ వివాదం వ్యవహారంపై ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు నేరుగా చంద్రబాబుకి ఫోన్ చేసి లడ్డూ వివాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Also Read : పవన్ కల్యాణ్.. అదొక పెద్ద క్రైమ్, జాగ్రత్తగా ఉండండి..!- హర్షకుమార్ వార్నింగ్