నాకు ఫోన్ చేయండి.. వాళ్ల భరతం పడతా- ఈదుపురం సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

గత ప్రభుత్వంలో పోలీసులను ఇష్టానుసారం వాడుకున్నారు. వారితో టీడీపీ, జనసేన క్యాడర్ పై ఇష్టానుసారం కేసులు పెట్టించారు.

నాకు ఫోన్ చేయండి.. వాళ్ల భరతం పడతా- ఈదుపురం సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Updated On : November 1, 2024 / 6:40 PM IST

Cm Chandrababu Naidu : నరకాసురుడిని చంపినప్పుడు పీడ విరగడైందని ప్రజలు సంబరాలు జరుపుకున్నారు, దీపావళి చేసుకున్నారు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో నరకాసురుడిని ఓడించామన్నారు. అది కూడా 93 శాతం స్ట్రైక్ రేట్ తో అని చెప్పారు. పార్టీ పెట్టి 43 ఏళ్లైందని, ఎప్పుడూ ఇన్ని సీట్లు గెలవలేదని సీఎం చంద్రబాబు అన్నారు. నన్ను, అనేక మందిని హింస పెట్టారు, అయినా రాజీలేని పోరాటం చేశామన్నారు. జైలు నుంచి నేను విడుదలైన రోజున ప్రజల అభిమానం చూశానని చంద్రబాబు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో దీపం-2 పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

”నాయకుడు అనే వాడు ప్రజల హృదయాల్లో అభిమానం సంపాదించుకోవాలి. నాయకులు వస్తే చెట్లు కొట్టడం, పరదాలు కట్టడం వంటివి ఉండకూడదు. అందరం కలిసి పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. గత ఐదేళ్లు స్వేచ్ఛ లేని జీవితాన్ని అనుభవించాం. నేను రాజకీయ కక్ష సాధింపులు చేయను. కానీ, తప్పు చేసిన వారిని వదలను” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు.

”వైసీపీ పాలనలో దౌర్భాగ్యకరమైన రోజులు చూశాం. స్వేచ్చే లేదు. ఆపరేషన్ చేసుకున్నా అన్నా అచ్చెన్నను వదల్లేదు. రాక్షసత్వంగా తీసుకెళ్లారు. నేను అవతలి వారిని వదిలి పెడుతున్నా అని మా కేడర్ అంటున్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టను. అదే సమయంలో రాజకీయ కక్షలు తీర్చుకోను. దీపం 1 నేనే ఇచ్చా. ఇప్పుడు దీపం 2 పథకం నేనే ప్రారంభిస్తున్నా. ఆడబిడ్డల ఖర్చు తగ్గించడానికి ఉచిత గ్యాస్ ఇవ్వాలనుకున్నా. డ్వాక్రాలు పెట్టా. భర్తకంటే భార్యకు ఆదాయం ఎక్కువ వస్తుంది. అది తెలుగుదేశం ఇచ్చిన శక్తి. డ్వాక్రా మహిళలకు పూర్వ వైభవం తీసుకొస్తాం. వారికి రివాల్వింగ్ ఫండ్, వడ్డీ లేని రుణాలు ఇచ్చాం.

మహిళలు, ఆడపిల్లలకు అనేక పథకాలు అమలు చేస్తూ వచ్చా. ఆడపిల్లలకు సమాజంలో గౌరవం ఉండాలి. అప్పుడే రాష్ట్రం బాగుంటుంది. కేంద్రం కొన్ని అడ్డంకులు పెట్టింది. డబ్బులు కడితేనే సిలిండర్లు ఇస్తామంటున్నారు. సిలిండర్ కోసం చెల్లించిన డబ్బును 48 గంటల్లో రీఫండ్ చేస్తాం. అసలు సిలిండర్ కు ముందే డబ్బు కట్టే పని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్ కు రూ.122 కోట్లు ఖర్చు అవుతోంది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. కానీ మనసు, మానవత్వం ఉంది.

3 నెలల వరకు పెన్షన్ మిస్ అయినా తీసుకోండి. సచివాలయ ఉద్యోగులు బాగా పని చేస్తున్నారు. ఒకరిద్దరి వల్ల చెడ్డ పేరు వస్తోంది. సచివాలయ ఉద్యోగుల ఫోన్లు జియో ట్యాగ్ చేశాం. సచివాలయ ఉద్యోగులు ఎవరైనా లబ్దిదారుల ఇంటి దగ్గర కాకుండా కార్యాలయం దగ్గర పెన్షన్ ఇస్తే వారి భరతం పడతా.

గత ప్రభుత్వంలో పోలీసులను ఇష్టానుసారం వాడుకున్నారు. వారితో టీడీపీ, జనసేన క్యాడర్ పై ఇష్టానుసారం కేసులు పెట్టించారు. రాష్ట్ర అప్పులు 10 లక్షల 50 వేల కోట్లు. వడ్డీ లక్ష కోట్లు. MRO ఆఫీసులు తాకట్టు పెట్టారు. మందు బాబులను కూడా తాకట్టు పెట్టారు. కల్తీ మద్యం ఏరులై పారింది.
ఇసుక అంతా అస్తవ్యస్తం. ఫ్రీగా ఇద్దామన్నా అనేక సవాళ్లు. ఏ కేడర్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవ్వొద్దని హెచ్చరించా. ఇసుక ఎక్కడైనా తవ్వుకోండి. అడ్డుకుంటే నాకు కాల్ చేయండి.

బెల్ట్ షాపు పెడితే పీడీ యాక్ట్ కేసు పెడతాం. పోలవరం పడకేసింది. డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. కొత్త వాల్ కట్టాలంటే రూ.900 కోట్లు కావాలి. ఫేజ్ 1 కి డబ్బులు ఇచ్చారు. విశాఖని ఆర్థిక రాజధాని చేస్తా. శ్రీకాకుళంకి ఎప్పుడూ రుణపడి ఉంటా. అండగా ఉన్నారు. శ్రీకాకుళం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అమరావతికి కేంద్రం సహకరిస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుతున్నాం. మెగా డీఎస్సీ ద్వారా డిసెంబర్ లో ఉద్యోగాలిస్తాం.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశాం. చెత్త పన్ను వేశారు. కానీ చెత్త తీయలేదు. ఎక్కడికక్కడ చెత్త ఉంది. ఆ చెత్తను క్లియర్ చేయడానికి మాకు ఏడాది సయమం పడుతుంది. వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంది. రేపు గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడుతున్నా. రూ.826 కోట్లు గుంతలు పూడ్చడానికే ఖర్చు అవుతోంది. మూలపేట పోర్టు వద్ద 10 వేల ఎకరాలతో ఇండస్ట్రియల్ పార్క్ కడతాం. దానికి అనుబంధంగా ఎయిర్ పోర్ట్ నిర్మిస్తాం. అర్హులందరికీ పెన్షన్లు ఇస్తాం. శ్రీకాకుళం జిల్లా అంతటికీ కుళాయి నీరు అందిస్తాం. బెంతు ఓరియా సమస్యను పరిష్కరిస్తాం. వెంటనే వారికి నేటివిటీ సర్టిఫికెట్లు ఇస్తాం. కొబ్బరి రీసెర్చ్ పార్క్ ని ఇచ్చాపురంలో ఏర్పాటు చేస్తాం.

నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం. పొట్టి శ్రీరాములును మనం గుర్తుంచుకోవాలి. 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారు. అక్టోబర్ 1 న నెహ్రూ ఆంధ్ర రాష్ట్రం ప్రకటించారు. 1956లో నవంబర్ 1 న ఆంధ్రా-తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అనేక తేదీలు ఉన్నాయి. క్యాబినెట్ లో చర్చించాం. డిసెంబర్ 15.. 1952న ప్రాణత్యాగం చేసిన రోజు. ఆ రోజును ప్రత్యేక దినంగా గుర్తిస్తున్నాం. ఆంధ్రా తెలంగాణ విభజన జరిగిన రోజు జూన్ 2. చరిత్రలో అనేక మార్పులు జరిగాయి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Also Read : 11 సీట్లే వచ్చినా నోరు లేస్తోంది, మీ సంగతి చూస్తా- వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్..