మీ సంగతి చూస్తా- వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్..
వైసీపీ చేసిన తప్పుడు విధానాలు, దోపిడీ వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు.

Pawan Kalyan : ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో దీపం-2 పథకం ప్రారంభోత్సవ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి 52 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. కోటి 8 లక్షల 36 వేల 882 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. సంక్షేమ పథకాలు మాకంటే గొప్పగా ఇవ్వలేరన్న వారికంటే మేము ఎక్కువగా ఇస్తామన్నారు పవన్ కల్యాణ్.
ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. ”ఐ.ఎస్.జగన్నాథపురం గ్రామం నాకు చాలా కీలకం. 14 ఏళ్ల క్రితం ఇక్కడి లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి వచ్చా. ఇది మా గురువు గారి ఊరు. త్రేతాయుగంలోనే స్వయంభు వెలసిన ఆలయం ఇది. 2009లో ఓటమి తర్వాత భవిష్యత్ లేకుండా చీకటి అలముకుంది. 14 ఏళ్ల క్రితం దీక్ష చేపట్టి స్వామి వారిని ఒక్కటే కోరాను. నేనున్నా అని స్వామి భరోసా ఇచ్చారు. ఈరోజు ఆ ధైర్యంతోనే నిలబడ్డా. జిల్లా అధికారులతో మాట్లాడి గ్రామానికి, ఆలయానికి అభివృద్ధి ఏం చేయాలో అన్నీ చేస్తా. స్వామి వారి ఆజ్ఞతో అనుకోకుండా దీపం-2 పథకం ప్రారంభించేందుకు ఇక్కడికి వచ్చా. ఐదేళ్ల క్రితం రోడ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడూ అదే దుస్థితి. ఆ కష్టం తెలియాలనే నడుచుకుంటూ గుడి కొండ ఎక్కాను” అని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఈ సందర్భంగా వైసీపీ నేతల తీరుపై పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. వైసీపీ చేసిన తప్పుడు విధానాలు, దోపిడీ వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. చింత చచ్చినా పులుపు చావడం లేదన్నట్లు ఇంత ఓడినా వారి నోరు ఆగట్లేదని ధ్వజమెత్తారు. మీ నోటి వెంట మరేమీ రాకుండా మీ భవిష్యత్తు సెట్ చేస్తానని పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. నేను త్రికరణ శుద్ధితో పని చేస్తానన్న పవన్.. ఆఫీసులో కూర్చుని ఇష్టానికి మాట్లాడితే మీ సంగతి చూస్తానని హెచ్చరించారు. తొక్కి నార తీస్తా, చూస్తూ ఉండమన్నారు.
మహిళలపై అశ్లీలత, వేధింపులు, సమస్యలపై పవన్ సీరియస్ గా స్పందించారు. ”సంక్షేమ హాస్టల్స్ లో బాత్రూమ్ లు సక్రమంగా లేవు. వసతులు లేవు. ఆడ బిడ్డలకు సమస్యలు వస్తే చర్యలు కఠినంగా ఉంటాయి. డీప్ ఫేక్ ఫోటోలు, టెక్నాలజీతో సోషల్ మీడియాలో వేధిస్తే సహించం. డిజిటల్ ప్రైవసీ యాక్ట్ రాకముందే ఆ చట్టం ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. వైసీపీ సోషల్ మీడియా ప్రతీ ఫ్లాట్ ఫాం మానిటరింగ్ చేస్తున్నాం. బలమైన యాక్షన్ తీసుకుంటాం. తర్వాత రోడ్లపైకి వస్తే కాళ్ళు, కీళ్ళు ఇరక్కొడతాం. ఈవీఎంలు టాంపరింగ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 151 నుండి 11 సీట్లు వస్తే డ్రామాలు, పాటలు మొదలుపెట్టారు. దేశ భద్రతకు భంగం కలిగేలా, మత విద్వేషాలు, కుల గొడవలు చేయాలని ఎవరైనా చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.
ఏలూరు ఐఎస్ జగన్నాథపురంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరాల జల్లు కురిపించారు. ఇక్కడి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం తిరుమల వంటి శక్తివంతమైన కేంద్రం అని పవన్ కల్యాణ్ అన్నారు. గుడి ప్రాకారం, గాలి గోపురానికి రూ.2.5 కోట్లు దేవాదాయ శాఖ ద్వారా కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాన రక్షణ గోడకు రూ.2 కోట్లు కేటాయించి నిర్మిస్తామని తెలిపారు. పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ గ్రామం తీర్చిదిద్దుతా అని పవన్ కల్యాణ్ ప్రకటించారు. వివాదంలో ఉన్న 50 ఎకరాల భూమి విడుదలయ్యేలా పని చేస్తామన్నారు. కొండ కింద నుండి పైకి రోడ్డు ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ తో మాట్లాడినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
Also Read : త్వరలోనే వైసీపీ నుంచి సీనియర్లు బయటకు రాబోతున్నారు: గంటా శ్రీనివాసరావు