నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. సెకండ్ లిస్టులో 40మందికి ఛాన్స్..!
టీటీడీ బోర్డు, వివిధ దేవాలయాల పాలక మండళ్లు, కుల సంఘాలకు సంబంధించిన ఛైర్మన్ పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Ap Nominated Posts (Photo Credit : Google)
AP Nominated Posts : ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఉండవల్లి నివాసంలో సమావేశమైన సీఎం చంద్రబాబు.. పార్టీ నేతలతో దాదాపు మూడు గంటల పాటు చర్చించినట్లు సమాచారం. వీలైనంత త్వరగా రెండో లిస్ట్ ప్రకటించాలని పార్టీ నేతలకు తెలిపారు. ఇక రెండో విడతగా 40మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇందుకోసం చంద్రబాబు కూటమి నేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం.
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తన నివాసంలో దాదాపు 3 గంటల పాటు పార్టీ బలోపేతం, నామినేటెడ్ పోస్టులు, రేపటి నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు. నామినేటెడ్ పదవుల రెండో దశ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. మొదటి దశలో దాదాపు 21 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను చంద్రబాబు ఇచ్చారు. అదే విధంగా రెండో దఫా కూడా దాదాపు 40కి పైగా కార్పొరేషన్లు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.
టీటీడీ బోర్డు, వివిధ దేవాలయాల పాలక మండళ్లు, కుల సంఘాలకు సంబంధించిన ఛైర్మన్ పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన దగ్గర ఉన్న ఫీడ్ బ్యాక్ తీసుకుని చెక్ చేస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు కష్టపడిన కార్యకర్తలు ఎవరికీ కూడా అన్యాయం జరగకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వడపోత పూర్తైందని తెలుస్తోంది. వివిధ మార్గాల ద్వారా.. సర్వే టీమ్స్, బ్యాక్ ఆఫీస్ ద్వారా వచ్చిన పేర్లను చంద్రబాబు దగ్గర పెట్టుకుని చూస్తున్నారు. దాదాపుగా లిస్ట్ ఫైనల్ అయిందని సమాచారం.
కూటమిగా పోటీ చేసిన నేపథ్యంలో బీజేపీ, జనసేన పార్టీలకు కూడా పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. మొదటి లిస్ట్ లో మూడు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు జనసేనకు, ఒక కార్పొరేషన్ ఛైర్మన్ (20 సూత్రాల ఆర్థిక సంఘం) పదవిని బీజేపీకి కేటాయించారు. అదే దామాషా పద్దతిలో రెండో విడతలోనూ ఆ రెండు పార్టీలకు అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీల దగ్గరి నుంచి పేర్లను కూడా సేకరించారు.
వీలైనంత త్వరలోనే రెండో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ సీఎం చంద్రబాబు దానికి సంబంధించి కసరత్తును పూర్తి చేశారు. అర్హులైన వారందరి పేర్లను తీయడం జరిగింది. వీలైనంత తొందరలోనే వారి పేర్లకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
అదే విధంగా రేపటి నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 100 రూపాయలతో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వారికి రూ.5 లక్షలు భీమాగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటివరకు అది రూ.2లక్షలు వరకు మాత్రమే ఉంది. అదే విధంగా శాశ్వత సభ్యత్వానికి సంబంధించి ఒక లక్ష రూపాయలు కడితే.. పార్టీ శాశ్వత సభ్యత్వం కల్పించేలా నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం.
Also Read : వైసీపీలోనే కొనసాగుతారా? జంప్ అవుతారా? మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దారెటు..