రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, ఉచితంగా 2లక్షల బోర్లు, రూ.2వేల కోట్లతో వైఎస్ఆర్ జలకళ పథకం ప్రారంభం

ap cm jagan launch ysr jala kala scheme..ఏపీ సీఎం జగన్ నవరత్నాల్లో మరో హామీని అమలు చేశారు. రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఈసారి రైతులకు గుడ్ న్యూస్ వినిపించారు. ఏపీ సీఎం జగన్ సోమవారం(సెప్టెంబర్ 28,2020) ఉదయం వైఎస్ఆర్ జలకళ పథకాన్ని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. రైతులకు మేలు చేసేలా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వమే రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల బోర్లు తవ్విస్తామని సీఎం జగన్ తెలిపారు. ఉచిత బోర్ల ద్వారా 5లక్షల ఎకరాలకు సాగునీరు అందునుంది.
పథకం ప్రారంభం సందర్భంగా 163 బోర్లతో కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ స్కీమ్ అన్నదాతలకు వరంగా మారనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.2వేల 340 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల మంది రైతులకు లబ్ది కలుగుతుందని సీఎం జగన్ చెప్పారు. చిన్న, సన్నకారు రైతులకు బోర్లు వేయడమే కాకుండా మోటార్లు కూడా ఇస్తామన్నారు. దరఖాస్తు నుంచి బోర్ డ్రిల్లింగ్ వరకు ఎప్పటికప్పుడు రైతుకు సమాచారం అందిస్తామన్నారు. భూగర్భ జలాల లభ్యతపై శాస్త్రీయంగా అంచనా వేస్తామన్నారు.
మెట్ట ప్రాంతాల్లో వలసలు తగ్గించేందుకు:
బోర్లు అవసరమైన చిన్న, సన్నకారు రైతులు దరఖాస్తు చేసుకోవాలని సీఎం జగన్ కోరారు. సర్వే, బోరు ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఒకసారి బోరు ఫెయిల్ అయితే రెండోసారి కూడా వేయిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక బోరు రిగ్గును ఏర్పాటు చేస్తామన్నారు. 2004లో వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ కు శ్రీకారం చుట్టారని సీఎం జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ బోర్లను కూడా ఉచితంగా ఇస్తున్నామని జగన్ చెప్పారు. మెట్ట ప్రాంతాల్లో వలసలు తగ్గించేందుకు ఈ పథకం సాయపడుతుందన్నారు.
జగన్ సర్కార్ సంక్షేమ పథకాలతో దూసుకెళుతోంది. ఇప్పటికే 90శాతం హామీలను అమలు చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో కీలకమైన హామీని నెరవేర్చింది. సన్న, చిన్న కారు రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్ రైతు భరోసా పథకంలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నవరత్నాల్లో రైతులకు ఉచిత బోర్‌వెల్ పై ఇచ్చిన హామీ మేరకు ఉచిత బోరుబావుల తవ్వకం కోసం వైఎస్సాఆర్ జలకళ పథకానికి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 28న క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ పథకాన్ని ప్రారంభించారు.
రైతులు ఇలా అప్లయ్ చేసుకోవాలి, అర్హతలు ఇవే:
* రైతులు ఈ పథకం కోసం తమ పరిధిలోని గ్రామ వాలంటీర్ల ద్వారా.. లబ్ధిదారుడు పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు కాపీతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
* అలాగే ఆన్‌లైన్‌లోనూ అప్లయ్ చేసుకునే వీలుంది.
* రైతులు చేసుకున్న దరఖాస్తులు గ్రామ సచివాలయం స్థాయిలో వీఆర్వో పరిశీలిస్తారు.
* అక్కడి నుంచి డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సదరు దరఖాస్తులను భూగర్భ జలాల సర్వే కోసం ముందుగా జియోలజిస్ట్‌కు పంపుతారు.
* సాంకేతికంగా దానిని జియోలజీ విభాగం పరిశీలించి అనుమతి ఇవ్వగానే డ్వామా అసిస్టెంట్ పిడి సదరు దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు.
* బోరు డ్రిల్లింగ్ వేసే ముందు రైతు పొలంలో హైడ్రో-జియోలాజికల్, జియోఫిజికల్ సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాతే బోర్లు వేస్తారు.
* సదరు అనుమతి అనంతరం కాంట్రాక్టర్ డ్రిల్లింగ్ సైట్ లో బోరు బావులను తవ్వుతారు.
* బోరుబావుల సక్సెస్ శాతంను బట్టి కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులు జరుపుతారు.
* రైతుకు కనిష్టంగా 2.5 ఎకరాలు, గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండాలి.
* ఒకవేళ రైతులకు అంత భూమి లేకపోతే పక్కనే ఉన్నవారితో కలిసి బోరు వేయించుకునే అవకాశం కల్పించారు.
* అంతేకాదు ఆ భూమిలో అంతకు ముందు ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు.
* ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది.
* ఏ రోజు రైతు పొలంలో బోర్ డ్రిల్లింగ్ చేస్తారో అది కూడా అటు రైతు ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా, ఇటు వాలంటీర్ల ద్వారా కూడా సమాచారం అందిస్తారు.
* ఒకవేళ మొదటిసారి బోర్ డ్రిల్లింగ్ లో నీరు పడక విఫలం అయితే, మరోసారి బోర్ కోసం నిపుణుడైన జియోలజిస్ట్ నిర్ధేశించిన ప్రాంతంలో డ్రిల్లింగ్ చేసేందుకు అవకాశం కల్పించారు.