8 నెలల తర్వాత ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ap cm jagan meets modi: ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. అలాగే.. విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలనూ ప్రస్తావించనున్నారు. ఎన్డీఏలో వైసీపీ చేరుతుందంటూ ప్రచారం జరుగుతుండగా ప్రధానితో జగన్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 8 నెలల తర్వాత ప్రధాని మోడీతో జగన్ భేటీ అయ్యారు.
సీఎం ఢిల్లీ పర్యటన మామూలే అయినా తాజా రాజకీయ పరిణామాలతో అది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఎన్‌డీఏ నుంచి శివసేన తప్పుకుంది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా అకాలీదళ్ బయటకు వచ్చింది. ఈ సమయంలో ఎన్‌డీఏలో చేరాలని బీజేపీ నుంచి వైసీపీకి ఆహ్వానం అందినట్లుగా ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇంతవరకూ దీనిపై బీజేపీ కానీ, వైసీపీ కానీ స్పందించ లేదు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను రెండుసార్లు కలుసుకున్నారు ఏపీ సీఎం జగన్.
ప్రధాని మోడీతో భేటీలో జగన్ తాజా రాజకీయాలతో పాటు పలు అంశాలను చర్చిస్తున్నట్లుగా సమాచారం. మూడు రాజధానులు, మండలి రద్దు, కోవిడ్ కట్టడి చర్యలను ప్రధానికి వివరిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వెంటనే విడుదల అయ్యేలా చూడాలని ప్రధానికి విజ్ఞాపన పత్రం అందించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌లతోనూ జగన్ సమావేశమవుతారని సమాచారం.
ఏపీ, తెలంగాణ మధ్య అంతరాష్ట్ర జలవివాదంపై మరికాసేపట్లో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగే సమావేశానికి వర్చువల్ పద్దతిలో తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. జగన్ ఢిల్లీలో ఉండటంతో ఆయన కూడా వర్చువల్ పద్ధతిలోనే సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది.