నెల్లూరు వైసీపీలో ఏం జరుగుతోంది? జగన్ ఆరా! 

  • Published By: sreehari ,Published On : December 25, 2019 / 12:53 PM IST
నెల్లూరు వైసీపీలో ఏం జరుగుతోంది? జగన్ ఆరా! 

Updated On : December 25, 2019 / 12:53 PM IST

నెల్లూరులో జరుగుతున్న పరిణామాలపై సీఎం జగన్‌ ఆరా తీస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు నగరంలో అన్ని రకాల మాఫియాలు ఉన్నాయని, నిక్కచ్చిగా పనిచేసే పోలీసు అధికారులను అక్కడ ఉండనివ్వరంటూ ఘాటుగా విమర్శించిన విషయం తెలిసిందే. అధికార పార్టీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు నగరంపై అదే పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు ఆనం చేసిన ఘాటు విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ సీరియస్‌ కావడం, ఇలా పత్రికలకెక్కడం సహించబోనని విజయసాయిరెడ్డి ద్వారా ఆనంకు చెప్పించారట.  దీనిని బలపరిచినట్లుగా అదే రోజు విజయసాయిరెడ్డి పార్టీ గీత దాటితే ఎంతటి వారైనా సరే వేటు తప్పదని హెచ్చరించారు కూడా. ఈ క్రమంలో ఆనం రామనారాయణరెడ్డికి రాష్ట్ర పార్టీ షోకాజ్‌ నోటీసు ఇస్తుందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది.

నేతలతో ఇబ్బందులు ఉన్నాయా?
ఈ ఘటనల క్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు సీఎంను కలిశారు. ఈ భేటీలో నెల్లూరు పరిస్థితిపై ఆనం చేసిన వ్యాఖ్యల గురించి సీఎం ప్రస్తావించారట. వీరి మధ్య కొంతసేపు చర్చ జరిగిందట. నెల్లూరులో ఏం జరుగుతుందో మీరే స్వయంగా విచారించి నివేదిక తెప్పించుకోవాలని సీఎంకు ఆనం విన్నవించినట్లు చెబుతున్నారు. పార్టీ నేతల పరంగా ఇబ్బందులు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, పత్రికలకు ఎక్కవద్దని జగన్‌ సూచించినట్లు సమాచారం. ఏదైనా సమస్య ఉంటే ముందుగానే తెలియజేస్తే బాగుండేదని చెప్పారట. 

వాస్తవ నివేదిక ఇవ్వండి :
ఈ చర్చల అనంతరం నెల్లూరులో ఏం జరుగుతుందో వాస్తవాలను తెలుసుకోవడంపై ముఖ్యమంత్రి దృష్టి సారించారని అంటున్నారు. ఆనం రామనారాయణరెడ్డి ఎందుకు అంత ఘాటుగా విమర్శించారు? ఆయన చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా? శాంతిభద్రతల సమస్య ఉందా? ప్రజలు ఏమనుకొంటున్నారు? అధికారులు ఎలా ఫీల్‌ అవుతున్నారు? అసలు నెల్లూరులో ఏం జరుగుతుందో తనకు వాస్తవ నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారట. 

మరో వైపు ఆనంపై మంత్రి అనిల్ అనుచర వర్గం గుర్రుగా ఉన్నట్లున్నారు. జిల్లాలో ఆనంకు ప్రాధాన్యం లేకపోవడం వల్లే తమ మంత్రిపై అసత్య ఆరోపణలకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. చక్కగా పరిపాలించమని జిల్లా నుంచి మొత్తం 10 మందినీ గెలిపిస్తే.. అంతర్గత కుమ్ములాటలతో ఇలా రచ్చకెక్కడం పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారట. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాక ముందే ఆ గోల ఏంటని అంటున్నారు.