కరోనా ఎఫెక్ట్ : ఏపీ ఎంసెట్, ఐసెట్, ఈసెట్ పరీక్షలు వాయిదా

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ తన అధికారిక వెబ్సైట్ లో పోస్టు చేసింది.
ఈ వైరస్ కారణంగా మే 14 , 2020 వరకు జరగాల్సిన అన్ని ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE)తెలిపింది. అంతేకాకుండా ఏప్రిల్ 20, 2020 నుంచి జరగాల్సిన ఏపీ ఎంసెట్, ఐసెట్, ఈసెట్ పరీక్షలను వాయిదా వేసింది. ఈ ప్రవేశ పరీక్షలను కాకినాడలోని జవహార్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి.
ఈ ప్రవేశ పరీక్షలకు అభ్యర్దులు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవటానికి మార్చి 29, 2020 వరకు ఉన్న గడువును ఏప్రిల్ 17, 2020 వరకు పొడిగిస్తూ ఏపీ స్టేట్ ఉన్నత విద్యామండలి తెలియజేసింది. అంతేకాకుండా త్వరలో ప్రవేశ పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ను ప్రకటించనున్నట్లు APSCHEఆఫీసర్ డాక్టర్ ఎం.సుధాకర్ రెడ్డి తెలిపారు.