ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్..

ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్..

AP Teachers

Updated On : May 21, 2025 / 10:12 AM IST

Teachers Transfer: ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉపాధ్యాయులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బదిలీల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ గురువారం విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ బదిలీల చట్టం ప్రకారం ఇవి జరుగుతాయని తెలిపింది.

ఉపాధ్యాయుల సర్దుబాటు, బదిలీల అంశంపై విద్యాశాఖ అధికారులతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు సఫలమయ్యాయి. ఉపాధ్యాయులు లేవనెత్తిన పలు డిమాండ్లకు అధికారులు అంగీకరించినట్లు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. దీంతో బుధవారం తలపెట్టిన జిల్లా విద్యాశాఖ అధికారుల కార్యాలయాల ముట్టడిని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెల్లడించారు. ఉపాధ్యాయుల సంఘాలతో చర్చలు సఫలీకృతం కావడంతో బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ బదిలీల్లో భాగంగా.. ప్రధానోపాధ్యాయులు ఒకే పాఠశాలలో ఐదు సంవత్సరాలుగా పనిచేస్తుంటే వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా.. ఉపాధ్యాయులు ఒకే చోటు ఎనిమిదేళ్లుగా పనిచేస్తుంటే వారుకూడా తప్పనిసరిగా బదిలీ అవుతారు. అంటే.. 2020 ఆగస్టు నుంచి పనిచేస్తున్న హెచ్ఎంలు, 2017 నుంచి పనిచేస్తున్న ఉపాధ్యాయులు బదిలీ జాబితాలో చేరుతారు. ఈ చర్యల ద్వారా పాఠశాలల్లో పని విభజన సమర్థవంతంగా జరిగి, సేవల నాణ్యత పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు.

బదిలీల ప్రక్రియలో పాయింట్ల ఆధారంగా ప్రాధాన్యత ఇస్తారు. దీనికి అనుగుణంగా కేటగిరి -1కి ఒక పాయింట్, కేటగిరి-2కి రెండు పాయింట్లు, కేటగిరి-3కి మూడు పాయింట్లు, కేటగిరి-4కి ఐదు పాయింట్లు, ఐదు స్టేషన్ పాయింట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సర్వీస్ పాయింట్లు ఏడాదికి 0.5గా పేర్కొంది. ఇది టీచర్లకు వారి సేవల ప్రాముఖ్యత ఆధారంగా తగిన ప్రాధాన్యత ఇవ్వడానికే ఉపయోగపడనుంది. ఈ పాయింట్ల ద్వారా వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.

మే31 నాటికి ఖాళీలు, పదవీ విరమణ చేసే స్థానాలు, హేతుబద్దీకరణ ఖాళీలు, తప్పనిసరిగా బదిలీ అయ్యే స్థానాలు, ఏడాదికిపైగా గైర్హాజరైన టీచర్ల ఖాళీలు, స్టడీ లీవ్ ఖాళీలను వెల్లడించనున్నట్లు ప్రభుత్వం వివరించింది.