కాణిపాక గణపయ్యకు బంగారు రథం

ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామివారి సేవలలో త్వరలో బంగారు రథం వచ్చి చేరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి కోసం బంగారు రథం తయారీకి అనుమతి ఇచ్చినట్లు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. రూ. 6 కోట్ల వ్యయంతో టీటీడీ ఆధ్వర్యంలో బంగారు రథాన్ని అత్యంత నాణ్యంగా తయారు చేయిస్తున్నట్లు మంత్రి వివరించారు.
సెప్టెంబర్ 2 వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆలయంలో 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ వినాయక చవితి మొదలుకొని 21 రోజుల పాటు సెప్టెంబర్ 22 వరకు జరిగే బ్రహ్మోత్సవాలలో స్వామి వారికి వివిధ సేవలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
వినాయక బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులకు, యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నిసౌకర్యాలు చేయాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశించారు.