అసెంబ్లీ సమావేశాలకు TDP దూరం : స్పీకర్, ఛైర్మన్‌లతో గవర్నర్ సమావేశాలు

ఏపీ రాజకీయాల్లో సోమవారం ఏం జరుగనుందనే దానిపై తెగ చర్చ జరుగుతోంది. శాసనమండలి రద్దుపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ మండలిలో జరిగిన పరిణామాలపై గవర్నర్ బిశ్వభూషణ్ ఆరా తీస్తున్నారు. గవర్నర్‌ను మండలి ఛైర్మన్ షరీఫ్ 2020, జనవరి 26వ తేదీ ఆదివారం కలిశారు. సాయంత్రం ఎట్ హోం కంటే ముందుగానే..షరీఫ్‌ను పిలిచి మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2020, జనవరి 25వ తేదీ శనివారం సాయంత్రం గవర్నర్‌ను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని కలిసిన సంగతి తెలిసిందే. సభాపతులతో గవర్నర్ జరిపిన భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. దీంతో 2020, జనవరి 27వ తేదీ సోమవారం నాడు జరిగే కేబినెట్ సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. మండలి రద్దుకే సీఎం జగన్ మొగ్గు చూపుతున్నట్లు, సోమవారం మండలి రద్దుపై తీర్మానం చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారని సమాచారం.
మండలిలో జరిగిన పరిణామాలపై టీడీపీ ముందుగానే గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అధికారపక్షం వ్యవహరించిన తీరును వీడియో క్లిప్పింగ్ ద్వారా గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి ఛైర్మన్ పంపించారని, దీనిపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉందని వెల్లడించారు. ఛైర్మన్‌పై దాడికి ప్రయత్నించారంటూ గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది.
రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తోందని, తమపై అధికారపక్షం దాడి చేస్తోందని, రూల్స్ ప్రకారం తమ సభ్యులను స్పీకర్ బయటకు పంపిస్తున్నారని..ఇది ఏ విధమైన రాజ్యాంగం అంటూ ప్రశ్నిస్తోంది టీడీపీ.
మరోవైపు శాసనమండలి రద్దు నేపథ్యంలో టీడీపీ అలర్ట్ అయ్యింది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను వైసీపీ అట్రాక్ట్ చేసే పరిస్థితులున్నాయని భావిస్తోంది. అందులో భాగంగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను చేజారనివ్వకుండా..జాగ్రత్త పడుతోంది. అందులో భాగంగా 2020, జనవరి 26వ తేదీ ఆదివారం TDLP సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది.
ప్రధానంగా మండలి రద్దుపై సుదీర్ఘంగా చర్చించారు. మండలిలో జరిగిన చర్చను శాసనసభలో చర్చించడం రాజ్యాంగ విరుద్ధమని, నిబంధనలకు విరుద్ధంగా శాసనసభలో జరిగే చర్చలకు దూరంగా ఉండాలని TDLP సమావేశంలో నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో సమావేశాలకు దూరంగా ఉండనుంది టీడీపీ.
Read More : ఏం జరుగుతోంది : TDLP మీటింగ్‌కు నలుగురు ఎమ్మెల్సీలు దూరం..చేజారినట్లేనా ?