ఒక్కో పేద కుటుంబానికి రూ.1,000.. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక సాయం

  • Published By: sreehari ,Published On : April 4, 2020 / 01:58 AM IST
ఒక్కో పేద కుటుంబానికి రూ.1,000.. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక సాయం

Updated On : April 4, 2020 / 1:58 AM IST

కరోనా వైరస్‌ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా నిరుపేదల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. పేదలకు చేయూత అందించేందుకు ఉచితంగా బియ్యం, కందిపప్పు అందిస్తోంది. అంతేకాదు..  ఒక్కో కుటుంబానికి రూ.1,000 చొప్పున నగదు ఇస్తోంది. వలంటీర్లు భౌతిక దూరం పాటిస్తూ (ఏప్రిల్‌ 4న) శనివారం ఉదయం 7 గంటల నుంచి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు నగదు పంపిణీ చేస్తారు. ఇదివరకే దీనిపై రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి విడతగా గత నెల 29 నుంచి పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ చేయడం జరుగుతోంది. (రైలు కూత మోగేదెప్పుడో.. ఏప్రిల్ 12 వరకు ఆగాల్సిందే? )

రాష్ట్రంలో బియ్యం కార్డు ఉన్న 1.30 కోట్ల కుటుంబాలకు వారి ఇంటి వద్దే వలంటీర్ల ద్వారా రూ.1000 చొప్పున నగదు సాయం అందించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలందరికీ ఏప్రీ ప్రభుత్వం ప్రత్యేక సాయం అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అర్హులు ఎవరైనా ఉన్నా వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. వారి అర్హత పరిశీలించిన అనంతరం రూ.1000 సాయం అందిస్తారు. 

బియ్యం కార్డులున్న కుటుంబాల జాబితాను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) అధికారులకు అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1,300 కోట్లను సెర్ప్‌కు విడుదల చేసింది. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా నగదు పంపిణీపై అన్ని జిల్లాలకు సెర్ప్‌ గైడ్ లైన్స్ జారీ చేసింది. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు ఈ నిధులను డ్రా చేస్తారు. అనంతరం గ్రామ సచివాలయ కార్యదర్శి… గ్రామ వార్డు కార్యదర్శులకు అందజేస్తారు.

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితోపాటు వలంటీర్లు కూడా విధుల్లో ఉండాల్సిన అవసరం ఉంది. వలంటీర్ల మొబైల్‌ అప్లికేషన్‌లో బియ్యం కార్డు లబ్ధిదారుల వివరాల ఆధారంగా రూ.1000 చొప్పున నగదు అందజేయాలని వెల్లడించారు. (కరోనా టెర్రర్.. 11మంది CISF జవాన్లకు పాజిటివ్)