Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. వెంటనే వైద్యం అందించాలని హైకోర్టు ఆదేశం..
ఏ ఆసుపత్రిలో వైద్యం అందిస్తారో వివరాలు తెలపాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోరు ఆదేశించింది.

vallabhaneni vamsi
Vallabhaneni Vamsi: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం.. వంశీకి తక్షణమే వైద్యం అందించాలని ఆదేశించింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆదేశాలు ఇచ్చింది. విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో వైద్యం కోసం న్యాయమూర్తిని వంశీ తరపు న్యాయవాది కోరగా.. అందుకు అనుమతి ఇచ్చింది న్యాయస్థానం.
కాగా.. వంశీకి అత్యవసర వైద్యం అందించాల్సిన అవసరం ఉందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది. వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కోర్టుకు మెడికల్ రిపోర్ట్స్ సమర్పించారు. దీంతో వైద్యం అందించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేవని వంశీ తరపు న్యాయవాది కోర్టు దృష్టి తీసుకెళ్లగా.. ఏ ఆసుపత్రిలో వైద్యం అందిస్తారో వివరాలు తెలపాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోరు ఆదేశించింది.
వంశీ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో పోలీస్ కస్టడీలో ఉండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వంశీకి అత్యవసర వైద్య సేవలు అందించారు. వంశీ బాగా నీరసించి కనిపించారు. నోటికి రుమాలు అడ్డుగా పెట్టుకుని దగ్గుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 100 రోజులకు పైగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీ. టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్థన్ పై దాడి, కిడ్నాప్, భూ కబ్జా.. ఇలా పలు కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు. తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు కూడా నమోదైంది. ఈ కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వరుస కేసుల విచారణ నేపథ్యంలో అటు జైలుకు ఇటు కోర్టులకు తిప్పుతున్న తరుణంలో ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు.