ఫిబ్రవరిలో స్థానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించలేమన్న ఏపీ ప్రభుత్వం

ఫిబ్రవరిలో స్థానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించలేమన్న ఏపీ ప్రభుత్వం

Updated On : December 15, 2020 / 8:23 PM IST

local body elections : ఏపీలో స్థానిక సంస్దల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ వేయాల్సి ఉన్నందున స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని అడిషనల్‌ అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోగా, ఆ సమయంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయనున్నామని.. పోలీసులు, సిబ్బందిని కేటాయించలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని ఎస్‌ఈసీ పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దని హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎస్‌ఈసీ నిర్ణయం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని, కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వ కర్తవ్యమని కూడా ఏపీ ప్రభుత్వం.. హైకోర్టుకు వాదనలు వినిపించింది. గతంలో కరోనా అంటూ ఎన్నికలు వాయిదా వేసి.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామనడంపై పిటిషన్‌లో ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.