Mptc Zptc Elections : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్ ను ఆదేశించలేమని ఏపీ హైకోర్టు అంది.

Ap Highcourt Key Comments On Mptc Zptc Elections
ap highcourt on mptc, zptc elections : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్ ను ఆదేశించలేమని ఏపీ హైకోర్టు అంది. ఎన్నికలు జరిపేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 30వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
పరిషత్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులో ఎస్ఈసీగా నిమ్మగడ్డ పదవీ విరమణ చేస్తున్నారు. ఎన్నికలను నిర్వహించి వెళ్లిపోవాలని ఎస్ఈసీని వైసీపీ కోరుతోంది. వెంటనే ఎన్నికలను పూర్తి చేస్తే ఆ తర్వాత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి స్థాయిలో చేపడతామని నిమ్మగడ్డను కలిసి చీఫ్ సెక్రటరీ విన్నవించారు.
మరోవైపు తమ ముందు హాజరు కావాలంటూ ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ కూడా నిమ్మగడ్డకు నోటీసులు పంపింది. ఈ నోటీసులకు ఆయన సమాధానమిస్తూ… తాను కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నానని… ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఇప్పటికిప్పుడే రాలేనని తెలిపారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వెంటనే నిర్వహించేలా ఎస్ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో మార్చి 18న మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికలు నిర్వహించకుండా ఎస్ఈసీ సెలవుపై వెళ్తున్నారని ఆ పిటిషన్లలో ఆరోపించారు. ఈ విషయమై రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఏపీలో గ్రామ పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ రెండు ఎన్నికల్లోనూ అధికార వైసీపీ ఘన విజయం సాధించింది. ఇదే ఊపులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళితే, ఈ ఎన్నికల్లో కూడా తాము మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని వైసీపీ నమ్మకంగా ఉంది.