మండలి రద్దు కోసం : ఏపీ కేబినెట్ అత్యవసర మీటింగ్

శాసనమండలి రద్దు కోసం వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మండలి రద్దు చేయాలంటే అనుసరించాల్సిన వాటిపై న్యాయ నిపుణులు, ఇతరులతో వైసీపీ పెద్దలు చర్చిస్తున్నారు. న్యాయపరంగా ఎదురయ్యే ఆటంకాలను ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలు రచిస్తోంది. న్యాయ సలహాలు ఇవ్వాలని అడ్వకేట్స్‌ను కోరింది వైసీపీ ప్రభుత్వం.
2020, 20వ తేదీ సోమవారం శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానులు, CRDA రద్దు బిల్లులను ప్రభుత్వం శాసనమండలిలో 2020, జనవరి 21వ తేదీ మంగళవారం ప్రవేశపెట్టింది. మండలిలో తీవ్రమైన ప్రతిఘటన టీడీపీ నుంచి ఎదురైంది. దీనిని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మండలిని రద్దు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై వైసీపీ తర్జనభర్జనలు పడుతోంది. ఎంత సమయం పడుతుంది ? అంచనా వేస్తోంది.
మండలి రద్దు కోసం చర్చించేందుకు ఏపీ కేబినెట్ అత్యవసరంగా భేటీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2020, జనవరి 21వ తేదీ రాత్రి 10గంటలకు ఈ సమావేశం జరుగనుందని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారాన్ని మంత్రులకు అందచేశారు. కేబినెట్ సమావేశానికి హాజరు కావాలని సూచించారు. కేబినెట్ ఆమోదించిన తర్వాత 2020, జనవరి 22వ తేదీ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించి..తదుపరి చర్యలు తీసుకోవడంపై వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
CRDA చట్టం రద్దు, పరిపాలన, వికేంద్రీకరణకు సంబంధించిన రెండు చట్టాలను శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనిని శాసనమండలిలో ప్రవేశపెట్టింది. కానీ ఇక్కడ వైసీపీకి 9 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. టీడీపీకి చూస్తే 34 మంది సభ్యుల బలం ఉంది. దీంతో సభ ప్రారంభం కాగానే ..గంట పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలమధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రూల్ 71ని టీడీపీ ప్రవేశపెట్టింది. మండలి ఛైర్మన్ ఆమోదం తెలపడంపై ఏపీ మంత్రులు ఫైర్ అయ్యారు. మండలి పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మండలి రద్దుకు వైసీపీ ప్రభుత్వం యోచిస్తోంది. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
Read More : వైసీపీ ప్రభుత్వానికి పవన్ శాపనార్థాలు