Jogi Ramesh : నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం.. సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత జోగి రమేశ్ ఫైర్
AP Liquor Case : కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారిపోయారు. ఒక బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిని అణగదొక్కాలని చూస్తున్నారు.

AP Liquor Case jogi ramesh
Jogi Ramesh : నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ అన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో జోగి రమేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనార్దన్ రావుతో నేను వీడియో చాట్ చేశానని ఓ వీడియో రిలీజ్ చేశారు. దానిమీద చర్చా వేదికలు నడిపారు. నా ఫోన్ నుంచి ఎప్పుడైనా.. ఎక్కడైనా జనార్ధన్ రావుతో చాట్ చేశామని నిరూపిస్తే ఏ శిక్షకు అయినా సిద్ధమని, లై డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నానని జోగి రమేశ్ అన్నారు.
నాపై ఆరోపణలు నిరూపించేందుకు చంద్రబాబు, లోకేశ్ సిద్ధమా అని జోగి రమేశ్ ప్రశ్నించారు. నా భార్యాబిడ్డలను తీసుకుని తిరుమల వెంకన్న దగ్గరకు వచ్చి నకిలీ మద్యం కేసులో నాకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రమాణం చేసి చెప్తా.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మీ కుటుంబ సభ్యులతో వచ్చి నేను తప్పు చేశానని చెప్తారా..? అంటూ జోగి రమేశ్ ప్రశ్నించారు. మీరు అక్కడదాకా రాలేకపోతే విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి దగ్గరకు అయినా వస్తా.. లేకపోతే నేనే చంద్రబాబు ఇంటికి వస్తా.. మీ ఇంట్లోనే భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పే దైర్యం మీకు ఉందా అని జోగి రమేశ్ అన్నారు.
కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారిపోయారు. ఒక బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిని అణగదొక్కాలని చూస్తున్నారు. మీకు కుటుంబం ఉంది.. నాకు కుటుంబం ఉంది.. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత దిగజారాలా..? ఇబ్రహీంపట్నంలో ఏఏ ఫ్యాక్టరీలో నకిలీ మద్యాన్ని నడిపిస్తున్నారో నేనే చూపించి బయట పెడితే తిరిగి నామీదే ఆరోపణలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నామన్నారు. దీనిలో పవన్ ను, బీజేపీని కలుపుకోరు. నారా వారి సారాను ఏరులై పారిస్తున్నారని జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా అధినేతను అయ్యన్నపాత్రుడు కారుకూతలు కూస్తే అప్పుడు మీ ఇంటికి వచ్చా.. నా మీద కేసులు పెట్టాలని చూశారు. ఆఫ్రికా నుంచి జనార్ధన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడైనా నా పేరు ఉందా…? ఒకపక్క ఫోన్ పోయిందని అంటారు.. మరోపక్క అదే చొక్కాతో తీసిన వీడియో రిలీజ్ చేస్తారు. ముఖ్యమంత్రి తన స్థాయి తగ్గించుకుని ఇలాంటి దగుల్బాజీ పనులు చేస్తున్నారు. నామీద కుట్రలు పన్నినా పైన దేవుడు ఉన్నాడని జోగి రమేశ్ పేర్కొన్నారు.
నా కులానికి సంబంధించిన వ్యక్తులకు ఉన్నవాస్తవాలు చెప్తే మిగతా వాళ్ళకు ఎందుకు ఇబ్బంది. ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్లకు జోగి రమేష్ ఏంటో తెలియదా. నా చరిత్ర మీకు తెలియదా.. మీ చరిత్ర నాకు తెలియదా.. చంద్రబాబు స్క్రిప్ట్ రాసిస్తాడు.. మావాళ్ళు కొందరు తిడతారు అని ముందే చెప్పా. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళే వాళ్ళను తిడతారు. జోగి రమేష్ ఎలాంటి వాడో మా వాళ్లందరికీ తెలుసు అంటూ జోగి రమేశ్ అన్నారు.