పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక కామెంట్స్..
ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో కలిసి మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు.

Polavaram Project: ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో కలిసి మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనులను ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు సార్లు పరిశీలించారని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి షెడ్యూల్‌కు అనుగుణంగా జరుగుతున్నాయని, డయాఫ్రమ్ వాల్ పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు.
వర్షాకాలంలో కూడా పనులు చేసేలా బట్రస్ డ్యామ్ పనులు పూర్తి కావొచ్చాయని, ఇప్పటికే పోలవరం హెడ్‌వర్క్స్ 80శాతం పైగా పూర్తయ్యాయని, 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నామని చెప్పారు.
పోలవరం పనులు వేగంగా జరుగుతుంటే ఓర్వలేకే అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమక్షంలో ప్యానల్ వెడల్పును 1.5 మీటర్లు ఉంది అంటూ బావర్ ప్రతినిధులు కొలిచి చూపించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో 1.5 మీటర్ల మందంతోనే నిర్మిస్తుంటే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రాజెక్ట్ పనులను ప్రపంచంలోనే ఎక్స్‌పర్ట్స్ అయిన జర్మనీకి చెందిన బావర్ కంపెనీతో మేఘా పనులు చేయిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాడు పోలవరం ప్రాజెక్టు మాకు అర్థం కాలేదు, ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేం అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేయలేనిది , కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి చూపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం లో నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.