Ram Gopal Varma: అప్పటి ఓవరాక్షన్‌కు ఇప్పుడు దెబ్బ పడబోతుందా?
పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఆర్జీవీ ఇప్పటివరకు స్పందించలేదు. నోటీసులు తీసుకున్నట్లుగా కూడా ఎక్కడా చెప్పలేదు.

రామ్‌గోపాల్ వర్మ.. శివ సినిమాతో మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన.. ఆ తర్వాత సినిమాల కంటే ఎక్కువగా రాజకీయాలను గెలకడమే పనిగా పెట్టుకున్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పేరెత్తితే చాలు..ఎక్స్‌లో ఈగ లాగా వాలిపోయే వారు. గత పదేళ్లుగా టీడీపీ టార్గెట్‌గా ఆర్జీవీ పెట్టిన పోస్టులు అన్నీ ఇన్నీ కావు. లాస్ట్ ఐదేళ్లలో అయితే..ఆర్జీవీ ఓ వైసీపీ కార్యకర్తలాగా పనిచేశారన్న విమర్శలు ఉన్నాయి.
జగన్‌ను ఎవరు విమర్శించినా..మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా వార్త వచ్చినా ఆ పార్టీ అధికార ప్రతినిధి లాగా ఎక్స్‌లో పోస్టులు పెడుతుండేవారు వర్మ. కొందరు వైసీపీ నాయకులను ఇంటర్వ్యూ చేయడం..తాను వైసీపీకి అనుకూలంగా ఇంటర్వ్యూలు ఇస్తూ..చంద్రబాబు, లోకేశ్, పవన్‌ను తక్కువ చేసి మాట్లాడటం వంటివి చేసేవారు. ఈ క్రమంలో ఎన్నికల ముందు ఆర్జీవీ పిచ్చి పీక్స్‌కు చేరింది. మళ్లీ జగనే పవర్‌లోకి వస్తారని కూడా జోస్యం చెప్పారు.
సీన్ రివర్స్
కట్ చేస్తే క్లైమాక్స్‌లో సీన్ రివర్స్ అయింది. వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కూటమి బంపర్ విక్టరీ సాధించింది. సార్ రూటు మార్చి..చంద్రబాబు, లోకేశ్, పవన్‌ను ట్యాగ్ చేస్తూ కంగ్రాట్స్ చెప్పి..సైలెంట్ అయిపోయారు. అప్పటి నుంచి టీడీపీ ముఖ్యనేతల మీద పవన్ మీద పోస్టులు పెట్టడం లేదు ఆర్జీవీ. కానీ గత ఐదేళ్లలో ఆయన పెట్టిన పోస్టులపై టీడీపీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ క్రమంలో ఒంగోలులో నమోదైన కేసులో ఆర్జీవీకి పోలీసుల నోటీసులు అందాయి.
ఎక్స్‌లో వ్యూహం సినిమా పోస్టర్లు పోస్ట్ చేసి.. చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదుపై ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్‌గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రమోషన్ టైమ్‌లో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు లోకేశ్, జనసేన అధినేత పవన్ ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ తన ఎక్స్‌లో పోస్టులు పెట్టారట. ఈ పోస్ట్ వ్యవహారంపై ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఆర్జీవీపై ఫిర్యాదు నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు పోలీసులు. మరోవైపు అమరావతిలోని తుళ్లూరులోనూ ఆర్జీవీపై మరో కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్ ఫొటోలను రామ్‌గోపాల్ వర్మ గతంలో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారంటూ టీడీపీ నేతలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
వైసీపీ హయాంలో సోషల్ మీడియాని అడ్డుపెట్టుకొని రెచ్చిపోయిన వాళ్లంతా, ఇప్పుడు ప్రభుత్వం మారిపోవడంతో అలర్ట్ అవుతున్నారు. వరుసగా నోటీసులు, విచారణలు, అరెస్ట్‌లు జరుగుతుండటంతో ఒక్కొక్కరిగా అలర్ట్ అవుతున్నారు. బోరుగడ్డ అనిల్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈ లిస్టులో ఇంకా చాలామంది పేర్లు బాకీ ఉన్నాయంటున్నారు టీడీపీ నేతలు. ఓ నటి సారీ చెప్పి చేసిన తప్పుల్ని కడిగేసుకొనే ప్రయత్నం చేశారు. పోసాని కృష్ణమురళి, రాంగోపాల్ వర్మపై కూడా చర్యలు తప్పేలా లేవు. అందులో భాగంగానే ఇప్పుడు ఆర్జీవీ వేట మొదలైనట్టు కనిపిస్తోంది.
తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం
టీడీపీని డ్యామేజ్ చేసేలా.. మరీ ముఖ్యంగా చంద్రబాబు ఇమేజ్ దెబ్బతీసేలా ఆర్జీవీ తీసిన సినిమాలపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. సినీ డైరెక్టర్‌గా తన పని తాను చేస్తే నో ప్రాబ్లమ్..వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉంటూ బాబును టార్గెట్ చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆర్జీవీ తన సినిమాల్లో అబద్ధాల్ని, అభూత కల్పనలను చూయించే పబ్లిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారని అంటున్నారు.
ఇక పవన్ కల్యాణ్‌ను అయితే మొదటి నుంచి టార్గెట్ చేసేవారు ఆర్జీవీ. కించపరిచేవారు. తేలికగా తీసుకున్నట్లుగా జోకులేసేవారు. అందుకే ఇప్పుడు ఆర్జీవీని వదిలేస్తే ఆయన మరింత రెచ్చిపోతారని యాక్షన్ తీసుకోవాలన్న డిమాండ్ టీడీపీ, జనసేన క్యాడర్ నుంచి బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో పోలీసులు తీసుకోబోయే చర్యలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఆర్జీవీ ఇప్పటివరకు స్పందించలేదు. నోటీసులు తీసుకున్నట్లుగా కూడా ఎక్కడా చెప్పలేదు. పోలీస్ నోటీసులు, కేసులు అంటూ ప్రచారం జరుగుతున్నా..ఆర్జీవీ సైలెంట్‌గా ఉన్నారంటే ఎక్కడో భయం మొదలైందని అంటున్నాయి టీడీపీ వర్గాలు. అయితే వర్మ పోలీస్ విచారణకు హాజరవుతారా.? విచారణకు హాజరు కాకపోతే పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కూడా ఆయనను విచారించి లైట్ తీసుకుంటారా..లేక అరెస్ట్ చేస్తారా అన్నది హాట్ టాపిక్ అవుతుంది.
కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీకి అనుమతి దొరికేనా? గవర్నర్ ఢిల్లీ టూర్ ముగిశాక ఏం జరగబోతుంది?